Indian Student Died In US: అమెరికాలో తెలుగు యువతి మృతి.. ఎవరీ జాహ్నవి కందుల? అసలు ఏం జరిగింది?

14 Sep, 2023 17:07 IST|Sakshi

సియాటెల్‌: గత జనవరిలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  తెలుగు యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. జాహ్నవి కందుల అనే యువతి రోడ్డు దాటుతుండగా కెవిన్‌ డేవ్‌ అనే అధికారి 911 పోలీస్‌ వాహనాన్ని అతివేగంతో నడిపి ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమె 100 అడుగులు ఎగిరి దూరంపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 

ఎవరీ జాహ్నవి కందుల?
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన  యువతి జాహ్నవి (23) అమెరికాలో సియాటెల్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతోంది.  2021లో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం మీద బెంగుళూరు నుంచి యూఎస్‌ వెళ్లింది. ఈ డిసెంబర్‌లో ఆమె మాస్టర్స్‌ పూర్తి కానుంది. ఇంతలోనే జాహ్నవి మరణ వార్త తెలియడంతో కందుల కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. తన మనవరాలును దూరం చేసుకున్న భాధ నుంచి కోలుకోక ముందే పోలీసు ప్రవర్తన గురించి తెలియడం మరింత దిగ్బ్రాంతికి గురిచేస్తందని ఆమె తాత ఆవేదన వ్యక్తం చేశారు. విషాదకరమైన ప్రమాదం తర్వాత ఎవరైనా అలా ఎలా మాట్లాడగలరని వాపోయారు.
చదవండి: జాహ్నవి మృతి: కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ

పోలీస్‌ వెకిలి నవ్వులు
 అయితే జాహ్నవి మృతి పట్ల అక్కడి పోలీస్‌ అధికారి చులకనగా మాట్లాడిన వీడియో తాజాగా బయటికి రావడంతో తీవ్ర దుమారానికి దారీతీసింది. జాహ్నవి మరణం  విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచ్చిన  పోలీసు అధికారి డానియెల్‌ అడరర్‌.. పైఅధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల వెకిలిగా మాట్లాడారు.

గట్టిగా నవ్వుతూ ‘ఆమె చచ్చిపోయింది. ఆ ఓ మామూలు వ్యక్తేలే. ‘ఏముంది. ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు  ఉంటాయేమో..విలువ తక్కువే..’ అని పగలబడి నవ్వుతూ మాట్లాడారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డవ్వగా వీటిని సోమవారం సియాటెల్‌ పోలీసులు బయటకు విడుదల చేశారు. దీనిపై  సియాటెల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.

ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంది. సదరు పోలీసు అధికారి నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే విధంగా కారు బాడీకామ్ వీడియోపై శాన్ ఫ్రాన్సిస్‌కోలోని భార‌త కాన్సులేట్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. జాహ్న‌వి మృతి ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసింది.

అతివేగమే ప్రమాదానికి కారణం
ప్రమాదం జరిగినప్పుడు కెవిన్ డేవ్ గంటకు 119 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నివేదికలో తెలిపింది. వాహనం ఢీకొనడానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. డేవ్ జాహ్నవిని ఢీకొట్టే నికి ఒక సెకను ముందు బ్రేకులు వేయడంతో ఆ వేగం ధాటికి ఆమె 100 అడుగుల ముందుకు ఎగిరిపడింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన వీధిలో వేగ పరిమితి గంటకు 25 మైళ్లు లేదా గంటకు 40 కి.మీ మాత్రమే.

అయితే జాహ్నవిని ఢీకొని ఆమె మరణానికి కారణమైన తోటి పోలీసు అధికారి కెవిన్‌ను కాపాడేందుకు డానియెల్‌ ప్రయత్నించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కెవిన్‌ కారును గంటకు 50 మైళ్ల వేగంతోనే నడుపుతున్నాడని, కారు అదుపు తప్పలేదని డానియల్‌ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నాడు. తప్పు జాహ్నవిదే అన్నట్టుగా చూపడానికి ప్రయత్నించాడు.

మరిన్ని వార్తలు