Antarctica: వణుకుపుట్టించే అంటార్కిటికాలో.. 11 మంది జననం.. ఇంతకూ మంచు ఖండం ఎవరిది?

21 Nov, 2022 02:58 IST|Sakshi

అంటార్కిటికా అంటేనే మంచు ఖండం.. మైనస్‌ ఉష్ణోగ్రతలు.. కాసేపు బయట ఉంటే మనుషులూ గడ్డకట్టుకుపోయేంత దుర్భర వాతావరణం. అలాంటి అంటార్కిటికాలో ఇప్పటివరకు 11 మంది పిల్లలు పుట్టారు. భేషుగ్గా బతికేస్తున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందామా..     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

ఉన్నవి పరిశోధనా కేంద్రాలే.. 
భూమ్మీద అన్ని ఖండాలు మనుషులతో నిండి ఉన్నా.. ఒక్క అంటార్కిటికాలో ఎలాంటి శాశ్వత నివాసాల్లేవు. కొన్నిదేశాలు వివిధ పరిశోధనలు, వనరుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. క్లిష్టమైన వాతావరణం కారణంగా.. ఈ కేంద్రాల్లో ఉండే శాస్త్రవేత్తలు, సిబ్బంది కూడా కొంతకాలానికే తిరిగి వచ్చేస్తుంటారు. వేరే వాళ్లు వెళ్తుంటారు. అంతేతప్ప అంటార్కిటికాలో మానవ శాశ్వత నివాసాలేమీ లేవు. 

అంటార్కిటికా తమదేనంటూ.. 
నిజానికి అంటార్కిటికా ఖండం ఏ దేశానికీ చెందినది కాదు. కానీ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే, యూకే వంటి పలు దేశాలు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమవేనంటూ వాటికవే ప్రకటించుకున్నాయి. దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఏమీ లేదు. మంచు ఖండంలోని ఏ ప్రాంతంలోకి ఏ దేశమైనా వెళ్లి పరిశోధనా కేంద్రాలు పెట్టుకోవచ్చు.

శాస్త్రవేత్తలు, సిబ్బంది వెళ్లవచ్చు. అయినా కొన్ని దేశాలు వెనక్కి తగ్గలేదు. మిగతా దేశాలతో పోలిస్తే మంచు ఖండానికి దగ్గరగా ఉన్న చిలీ, అర్జెంటీనా, యూకేలు (ఫాక్‌లాండ్‌ దీవులు) అంటార్కిటికాపై ఎక్కువ దృష్టిపెట్టాయి. ఈ మూడు దేశాలు తమదిగా ప్రకటించుకున్న ప్రాంతం చాలావరకు ఒకటే కావడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరిగాయి. 

ఇద్దరి ‘పోరు’తో..
1970వ దశకంలో అర్జెంటీనా పాలకుడు జార్జ్‌ రఫీల్‌ విడెలా, చిలీ అధినేత అగస్టో పినోచెట్‌ ఇద్దరూ అంటార్కిటికాలోని ప్రాంతాలపై ఆధిపత్యం కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. అంటార్కిటికాలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని, జీవించడం చాలా కష్టం. అందుకే తెలివిగా చిత్రమైన ప్లాన్‌ వేశా­రు. తమ పౌరులు జన్మిం­చిన ప్రాంతం తమదేనని చెప్పుకొనేందుకు వీలవుతుందని భావించారు. ఇందుకోసం అంటార్కిటికాలో తమ దేశవాసులు పిల్లల్ని కనే ఏర్పాట్లు చేశారు. 

క్లిష్టమైనా.. అంతా సేఫ్‌.. 
అంటార్కిటికాలో అసలే అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు. రాకపోకలు చాలా కష్టం.. డెలివరీ సమయంలో ఏదైనా తేడా వస్తే అవసరమైన వైద్య సదుపాయాలూ ఉండవు. అయినా ఆ ఖండంపై ప్రసవాలన్నీ సురక్షితంగా జరగడం, పుట్టిన 11 మంది శిశువులు ఆరోగ్యంగా తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం గమనార్హం.   

1978 జనవరిలో ‘తొలి’ జననం! 
1977 మొదట్లో చిలీ అధినేత పినోచెట్‌ అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన తమ దేశ పరిశోధన కేంద్రానికి అధికారిక పర్యటన నిర్వహించి.. ఆయా ప్రాంతాలు తమవేనని ప్రకటించారు.  
మరోవైపు అర్జెంటీనా అదే ఏడాది చివరిలో సిల్వియా మొరెల్లో డి పాల్మా అనే ఏడు నెలల గర్భిణిని అంటార్కిటికాలోని తమ ఎస్పరాంజా బేస్‌కు పంపింది. ఆమె 1978 జనవరి 7న ప్రసవించింది. ఇదే అంటార్కిటికా ఖండంలో తొలి శిశువు జననం. 
చిలీ అయితే మరో అడుగు ముందుకేసి కొత్తగా పెళ్లయిన జంటను అంటార్కిటికాలోని తమ బేస్‌కు పంపింది. వారు అక్కడే కాపురం చేసి, పిల్లలను కన్నారు. 
తర్వాత కూడా ఇది కొనసాగింది. ఇరుదేశాలు పెళ్లయిన జంటలు, గర్భిణులను అంటార్కిటికాలోని తమ బేస్‌లకు తరలించాయి. ఇలా కొన్నేళ్లలో మొత్తంగా 11 మంది అంటార్కిటికాలో పుట్టారు. 
అయితే అర్జెంటీనా, చిలీల ప్రయత్నాలను ప్రపంచ దేశాలు తప్పుపట్టడం, మంచు ఖండంపై ఏ దేశానికీ హక్కులు ఉండవని స్పష్టం చేయడంతో ఇది ఆగిపోయింది. ఆ తర్వాత ఏ దేశం కూడా అంటార్కిటికాలో ఇలా పిల్లలను కనేలా చేయడం వంటి ప్రయత్నాలు చేయలేదు.   

మరిన్ని వార్తలు