‘కోవిడ్‌’ పెరుగుతున్నా మరణాలు ఎందుకు తక్కువ!

19 Sep, 2020 14:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజు రోజుకు అప్రతిహతంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోండడం ఉపశమనం కలిగిస్తోంది. ఎందుకు మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది ? సకాలంలో చికిత్స తీసుకోవడం వల్లన మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందా? వైరస్‌ ప్రభావం నిర్వీర్యం అవుతూ వస్తోందా ? వాతావరణ పరిస్థితులు వైరస్‌పై ప్రభావం చూపిస్తున్నాయా? మృతుల సంఖ్యను ఉద్దేశ పూర్వకంగానే పాలనా యంత్రాంగాలు ప్రజలకు తెలియజేయకుండా దాస్తున్నాయా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ఇంగ్లండ్, వేల్స్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన వారి డేటాను తెప్పించుకొని పరిశోధకులు విశ్లేషించారు. కోవిడ్‌ వైరస్‌ పట్ల అవగాహన పెరగడంతో మధ్య వయస్కులు, వృద్ధులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే సార్వజనీయ స్థలాలకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నిండం లాంటి జాగ్రత్తలు. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు క్రమానుగతంగా ఎత్తి వేస్తుండడం వల్ల ఉద్యోగం కోసం, ఉపాధి కోసం లేదా ఉల్లాసం కోసం యువత ఎక్కువగా బయటకు వెళుతోంది. ఫలితంగా యువతనే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతోంది.

అవగాహన పెరగడంతో బయటకు వెళ్లి వస్తోన్న యువత, వృద్ధ తరానికి దూరంగా ఉండడం లేదా వారే యువతరానికి దూరంగా మసలడం వల్ల వృద్ధతరంలో కోవిడ్‌ కేసులు తగ్గుతూ వస్తోన్నాయి. కరోనా బారిన పడిన వారిలో యువతలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉండగా, వృద్ధతరంలో ఎక్కువగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ కారణంగానే రోజు రోజుకు కోవిడ్‌ కేసులు పెరగుతున్నా మరణాలు తగ్గుతున్నాయి. ఇక మృత్యు బారిన పడుతున్న మధ్య వయస్కుల్లో ఎక్కువ మంది ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారే ఉన్నారు. (రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌)

ఆగస్టు నాటికి మృత్యువాత పడిన కోవిడ్‌ కేసులను పరిశోధకులు అధ్యయనం చేయగా, 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సున్న యువతలో ప్రతి లక్ష మంది జనాభాలో ఒకరు మాత్రమే మృత్యువాత పడే ఆస్కారం ఉందని తేలింది. అలాగే 30 నుంచి 34 ఏళ్ల మధ్యనున్న యువతలో మృత్యువాత పడే ప్రమాదం రెట్టింపు అవుతోంది. అంటే ప్రతి లక్ష మందిలో ఇద్దరు మరణించే అవకాశం ఉంది. అదే 65 ఏళ్ల పురుషుల్లో ప్రతి వెయ్యి మందిలో ఒకరు మరణించే ఆస్కారం ఉండగా, 75 ఏళ్ల మహిళల్లో ప్రతి వెయ్యి మందిలో ఒకరు మరణించే ఆస్కారం ఉంది.

ఇదే ఓ కుటుంబానికి వర్తింప చేస్తే 90 ఏళ్ల బామ్మ కరోనా బారిన పడితే తన 52 ఏళ్ల కూతురు కన్నా 120 రెట్లు మృత్యువాత పడే అవకాశం ఉండగా, ఆ కూతురు తన 14 ఏళ్ల మనవరాలికన్నా 259 రెట్లు ఎక్కువగా మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కోవిడ్‌ గురించి పెద్దగా అవగాహన లేనప్పుడు ఇంట్లో ఒక్కరికి వస్తే ఇంట్లోని వారందరికి కరోనా వచ్చేది. సహజంగా వృద్ధులు లేదా ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారు ఎక్కువగా మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఓ ఇంట్లో ఒకరిద్దరికి కరోనా వస్తే మిగతా వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట్లో కోవిడ్‌ పరీక్షలు కోవిడ్‌ లక్షణాలున్నా లేదా నిర్ధారణయిన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పరిమితం కాగా, ఇప్పుడు సామాహికంగా అందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కారణాల వల్లనే కేసులు పెరుగుతున్న మృత్యువాత పడుతున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కరోనా చికిత్సకు సరైన మందులుగానీ, నిరోధానికి సరైన వ్యాక్సిన్‌లుగానీ అందుబాటులోకి ఇంతవరకు రానందున మృత్యు నివారణలో వైద్య ప్రభావం పెద్దగా లేదని పరిశోధకులు అంటున్నారు. (చదవండి: యూకేలో మళ్లీ కరోనా విజృంభణ)

మరిన్ని వార్తలు