భుజంపైనే టీకాలు ఎందుకు?

23 May, 2021 05:25 IST|Sakshi

ఇండియానాపొలిస్‌(అమెరికా): దేశం మొత్తమ్మీద కోవిడ్‌–19 నిరోధక టీకాలు తీసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరువ అవుతోంది. తొలి డోసు ఎడమ భుజంపై, రెండో డోసు ఇంకో భుజంపై తీసుకోవడం మనలో చాలామంది గమనించే ఉంటారు. పోలియో, రోటా వైరస్‌ వంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగించే వ్యాక్సిన్లను నోటిద్వారా, మరికొన్ని టీకాలను చర్మం కింద ఇస్తూంటే.. కోవిడ్‌ టీకాలను ఇంట్రామస్క్యులర్‌ అంటే భుజం కండరాల ద్వారా మాత్రమే ఎందుకిస్తున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే...

భుజం పైభాగంలో ఉండే డెల్టాయిడ్‌ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ తాలూకూ ముఖ్యమైన కణాలు ఉంటాయి. వైరస్‌ తాలూకూ అవశేషాలను అంటే యాంటిజెన్లను ఇవే గుర్తిస్తాయి. టీకాలను.. వైరస్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా లేదా అందులోని భాగాలతో తయారు చేస్తారన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఈ యాంటిజెన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్‌ కండరం వద్ద టీకా ఇస్తే రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుందన్నమాట. కొన్ని రకాల కోవిడ్‌ టీకాల్లో యాంటిజెన్లు ప్రత్యక్షంగా లేకపోయినా వాటిని తయారు చేసే ప్రణాళిక ఉంటుంది.

కండరాల్లోని రోగనిరోధక వ్యవస్థ కణాలు వీటికీ తేలికగానే స్పందిస్తాయి. టీకాను రోగ నిరోధక వ్యవస్థ కణాలు గుర్తించగానే యాంటిజెన్ల వివరాలను వినాళ గ్రంథులకు అందజేస్తాయి. ఈ వినాళ గ్రంథుల్లో మరిన్ని రోగ నిరోధక వ్యవస్థ కణాలు యాంటిజెన్లను గుర్తించి యాంటీబాడీలను తయారు చేసే ప్రక్రియ మొదలయ్యేలా చేస్తాయి. వినాళ గ్రంథులకు దగ్గరగా ఉండటం భుజంపై టీకా ఇవ్వడానికి ఇంకో కారణం. బాహు మూలాల్లో ఈ వినాళ గ్రంధులు ఉంటాయి. యాంటిజెన్లతోపాటు టీకాలో ఉండే ఇతర పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడతాయి.  

స్థానికంగా కట్టడి...
వ్యాక్సిన్‌ వేసుకున్నాక శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావొచ్చు. భుజం కండరాల్లో వ్యాక్సిన్‌ ఇస్తే... ఇలాంటి వాటిని స్థానికంగా కట్టడి చేసే శక్తి డెల్టాయిడ్‌ కండరాలకు ఉంటుంది. అంతేకాకుండా కొవ్వు పేరుకుపోయే చోట ఉండే కండరాలకు ఇస్తే శరీరమంతటా దద్దుర్లు, ర్యాష్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొవ్వు పట్టిన చోట కండరాలకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా వ్యాక్సిన్లను సరిగా సంగ్రహించలేవు. వీటితో పాటు భుజంపై టీకా తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు. టీకాను భుజంపైనే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు