‘నా భర్తతో పాటే నేను చనిపోయాననుకున్నారు.. ఎన్నికల్లో పోటీ చేస్తా’

31 Jul, 2021 14:25 IST|Sakshi
హత్యకు గురైన హైతీ అధ్యక్షుడి భార్య మార్టిన్‌ మోయిజ్‌ (ఫైల్‌ ఫోటో, ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ))

దివంగత హైతీ అధ్యక్షుడి భార్య మార్జిన్‌ మోయిజ్‌

నూయార్క్‌టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి

వాషింగ్టన్‌: ఈ నెల ప్రారంభంలో(జూలై 7) హైతీ అధ్య‌క్షుడు జోవెనెల్ మోయిజ్‌ను త‌న అధికారిక నివాసంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య‌ చేసిన సంగతి తెలిసిందే. దాడిలో గాయ‌ప‌డ్డ అధ్య‌క్షుడు మోయిజ్ భార్య ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె న్యూయార్క్‌టైమ్స్‌తో మాట్లాడారు. హంతకులు అధ్యక్షుడి నివాసంలో దేని కోసం వెతికారు.. తాను ఇంకా సజీవంగా ఉన్నానో, లేదో తెలుసుకోవడానికి వారు చేసిన ప్రయత్నాల గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

ఈ సందర్భంగా మార్టిన్‌ మోయిజ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చనిపోయానని భావించి.. వారు నన్ను వదిలేశారు. నా భర్త చుట్టూ ఎప్పుడు 30-50 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అంత మంది ఉండగానే నా భర్తను చంపేశారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. నా భర్త సెక్యూరిటీ గార్డుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు.. కనీసం తీవ్రంగా గాయపడలేదు కూడా. వ్యవస్థే నా భర్తను పొట్టన పెట్టుకుంది’’ అని ఆరోపించారు. 

మార్టిన్‌ మాట్లాడుతూ.. ‘‘ఘటన జరిగే సమయానికి మేం గాఢ నిద్రలో ఉన్నాం. తుపాకుల మోత విని లేచాం. వెంటనే సహాయం కోసం నా భర్త తన భద్రతా బృందాన్ని పిలిచాడు. ఆలోపే వారు మా బెడ్రూంలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నా భర్త చనిపోయాడు.. నా చేతికి, మోచేయికి దెబ్బ తగిలింది. ఓ పక్క తీవ్ర రక్తస్రావం.. మరోవైపు ఊపిరాడనట్లు అనిపించింది. ఇక హంతకులు స్పానిష్‌లో మాత్రమే మాట్లాడారు (హైతీ అధికారిక భాషలు క్రియోల్, ఫ్రెంచ్). హంతకులు దాడి చేసినప్పుడు ఎవరితోనో ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అయ్యారు. హంతకులు మా గది నుంచి ఏమి తీసుకున్నారో నాకు తెలియదు.. కానీ నా భర్త ఫైల్స్‌ ఉంచే షెల్ఫ్‌ని గాలించారు’’ అని తెలిపారు.

మార్టిన్‌ మాట్లాడుతూ.. ‘‘నా భర్తను హత్య చేసిన వారు నేను భయపడాలని.. రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వారి ఆశలు నెరవేరవు. నేను కోలుకున్న తర్వాత అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను. నా భర్తను చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. లేదంటే వారు అధికారం చేపట్టిన ప్రతి ఒక్క అధ్యక్షుడిని చంపుతారు. నా భర్తను హత్య చేసిన దుండగులను శిక్షించకపోతే.. ఇప్పుడు జరిగిన దారుణం మళ్లీ మళ్లీ జరుగుతుంది’’ అన్నారు. 

53 ఏళ్ల వయసున్న మోయిజ్‌ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు  నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్ష నేతలు ఆయన గద్దె దిగాలని కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు