ఇక్కడ ఆడాలంటే దమ్మునోళ్లు కావాలి.. గోల్ఫ్ కోర్సులో పులులు, సింహాలు..

30 Aug, 2022 08:57 IST|Sakshi

ఓ భారీ జిరాఫీని అప్పుడే వేటాడిన నాలుగు యువ సింహాలు, రెండు శివంగులు.. ఆ ‘ఆహారాన్ని’ సొంతం చేసుకొనేందుకు కదన రంగంలోకి దిగి వాటిని తరుముతున్న 20 హైనాలు. తమ వేటను తిరిగి చేజిక్కించుకొనేందుకు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్న ఆడ సింహాలు.. ఆ ఇందులో పెద్ద వింత ఏముంది.. ఆఫ్రికా అడవుల్లో ఇలాంటి దృశ్యాలన్నీ సర్వసాధార­ణమేగా అనుకుంటున్నారా?

కానీ ఇదంతా జరిగింది అడవిలో కాదు.. అడవి మధ్య ఉన్న ఓ గోల్ఫ్‌ కోర్స్‌లో! దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌ నడిమధ్యన ఉన్న స్కుకుజా గోల్ఫ్‌ క్లబ్‌లో తాజాగా కొందరు ఆటగాళ్లు గోల్ఫ్‌ ఆడుతుండగా వారి ఆటకు ఈ క్రూర మృగాలు ఇలా బ్రేక్‌ వేశాయి! ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అడవికి, గోల్ఫ్‌కోర్స్‌కు మధ్య ఎటువంటి రక్షణ కంచె లేకపోవడంతో జంతువులు తరచూ ఇలా లోపలకు దూసుకొస్తాయట. గోల్ఫ్‌కోర్స్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో దప్పిక తీర్చుకొనేందుకు జిరాఫీలతోపాటు చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, అడవి దున్నలు తరచూ అక్కడకు వస్తుంటాయట!!

అందుకే ఇక్కడ గోల్ఫ్‌ ఆడాలనుకొనే ఆటగాళ్లకు ఎంతో గుండెధైర్యం కావాలట! అదొక్కటే కాదు.. అడవి జంతువులేవైనా దాడి చేసి చంపేస్తే క్లబ్‌ నిర్వాహకుల బాధ్యతేమీ లేదంటూ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన వారినే ఇందులోకి అనుమతిస్తారట!! క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌ సిబ్బంది కోసం 1972లో ఈ గోల్ఫ్‌కోర్స్‌ను తొలుత ఏర్పాటు చేయగా ఆ తర్వాత క్రమంగా స్థానికులతోపాటు పర్యాటకులకు కూడా ఇందులో ఆడేందుకు అవకాశం కల్పించారు. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన, క్రూరమైన గోల్ఫ్‌కోర్స్‌గా పిలుస్తున్నారు.
చదవండి: రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి

మరిన్ని వార్తలు