రోజురోజుకు వ్యాపిస్తోన్న కాలిఫోర్నియా కార్చిచ్చు

10 Sep, 2020 09:28 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరి​కాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు చెలరేగిపోతోంది. ఇప్పటి వరకు ఈ మంటల్లో చిక్కుకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. వేలాది గృహాలు, ఇతర నిర్మాణాలు దగ్థమయ్యాయి. ఈ సంవత్సరం కాలిఫోర్నియా అడవిలో ఏర్పడిన మంటల్లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. మూడు వారాలకుపై నుంచి ఉత్తర కాలిఫోర్నియా అడవులలో మంటలు చెలరెగుతున్నాయి. గాలులు బలంగా, వేగంగా వీస్తుండటంతో మంటలు దావానంలా అంటుకుంటున్నాయి. ఈ మంటల కారణంగా అనేక  గృహాలు దగ్ధమయ్యాయి. 


 ఒరోవిల్లే సమీపంలో ఉన్న కమ్యూనిటీలలోని వేలాది మందిని  అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయమని కోరారు. బుధవారం అగ్నికీలలు తీవ్ర రూపం దాల్చి భిన్నమైన నారింజ రంగు మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు అక్కడి వారిని ఖాళీ చేయాలని ఆదేశించారు. పారడైజ్‌లో రెండేళ్ల క్రితం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఘోరమైన మంటలు చెలరేగి పట్టణం సర్వనాశనమైంది. దీంతో అక్కడ ఉన్నవారందరూ బెంబేలెత్తుతున్నారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

లాస్‌ఏంజెలెస్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని వాతావరణ శాస్త్రవేత్త డేనియల్ స్వైన్ మాట్లాడుతూ, 24 గంటల్లో మంటలు సుమారు 400 చదరపు మైళ్ళు (1,036 చదరపు కిలోమీటర్లు) వ్యాపించాయని, అక్కడ ఉన్నవన్ని కాలిపోయాయని తెలిపారు. వాష్టింగ్టన్‌లో కూడా ఇప్పటి వరకు  చూడని విధంగా  ఒక్కరోజులో అనేక ఎకరాలు కాలిపోయాయి అని ఫైర్‌ ఫైటర్స్‌  చెప్పారు. కాలిఫోర్నియాలో ఈ  ఏడాది ఇప్పటికే 2.5 మిలియన్‌ ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. 

చదవండి: ఆగని కార్చిచ్చు.. పైలట్‌ మృతి

మరిన్ని వార్తలు