ముందస్తు మంత్రం ఫలిస్తుందా? 

20 Sep, 2021 02:35 IST|Sakshi

కెనడా ప్రధాని ట్రూడో హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారా? 

నేడే పార్లమెంటు ఎన్నికలు  

ఒట్టావా: కెనడా పార్లమెంటుకి రెండేళ్లు గడువు ఉండగానే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 20న (సోమవారం) జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికార లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కఠినమైన ఆంక్షల్ని విధించి కరోనా మహమ్మారి కొమ్ములు వంచిన దేశ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో అదే తనని మళ్లీ విజయతీరాలకు నడిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు. కరోనాని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకొని కన్జర్వేటివ్‌ నాయకుడు ఎరిన్‌ ఒ టూలే ఢీ అంటే ఢీ అంటున్నారు. కెనడాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా ప్రకటిస్తారు. కానీ, ఈసారి కరోనా ముందు జాగ్రతల్లో భాగంగా భౌతికదూరం పాటించాలని ఎక్కువ మంది ఓటర్లు మెయిల్‌ ఇన్‌ ఓటు విధానాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  

ఎందుకీ ముందస్తు ఎన్నికలు 
338 స్థానాలున్న కెనడా పార్లమెంటులో లిబరల్‌ పార్టీకి ప్రస్తుతం 155 మంది సభ్యుల బలమే ఉంది. ఇతర పార్టీలతో కలిసి మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ప్రధాని ట్రూడో కీలక నిర్ణయాలకి భాగస్వామ్యపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నందుకు ప్రజలు ఆదరిస్తారని,  అత్యధిక సీట్లు సాధించి మెజార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలన్న ఆశతో ట్రూడో రెండేళ్లు గడువు ఉండగానే ఎన్నికలకు వెళుతున్నారు. ఆగస్టు 15న ట్రూడో ముందస్తు ఎన్నికపై ప్రకటన చేస్తూ కోవిడ్‌ని తరిమికొట్టినవారే దేశ పునర్నిర్మాణాన్ని చేయగలరంటూ పిలుపునిచ్చారు. 2015లో తొలిసారిగా నెగ్గిన ట్రూడో హ్యాట్రిక్‌ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు.  

గట్టిపోటీ ఇస్తున్న ఎరిన్‌  
ట్రూడోకి కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎరిన్‌ ఒ టూలే నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కెనడాలో ఈ మధ్య మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో దానిని ఎన్నికల సభల్లో ఎరిన్‌ ప్రస్తావిస్తున్నారు. ‘‘కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ ముంగిట్లో ఉన్నాం. ఈ సమయంలో ఎన్నికలకు వెళితే మళ్లీ కేసులు పెరిగిపోతాయి. పరిస్థితి మొదటికొస్తుంది. అదే నాకు ఆందోళనగా ఉంది’’అంటూ ఎరిన్‌ పదే పదే చెబుతూ ఓటర్ల మైండ్‌సెట్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు ప్రకటించిన సమయంలో అధికార లిబరల్స్‌కి 35.6% ఓటర్ల మద్దతు ఉందని, కన్జర్వేటివ్స్‌కి 28.8% ఓటర్ల మద్దతు ఉందని సీబీసీ న్యూస్‌ పోల్‌ ట్రాకర్‌లో వెల్లడైతే, తాజాగా.. లిబరల్స్‌కి 31.6%, కన్జర్వేటివ్‌లకి 31.1% మంది ఓటర్ల మద్దతు ఉందని తేలింది. అయితే ఎవరు నెగ్గినా మెజార్టీ స్థానాలు దక్కవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.  

బరిలో 49 మంది భారతీయులు 
కెనడా ఎన్నికల్లో మనోళ్లు కూడా సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కెనడియన్లు 20 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అందులో నలుగురు ట్రూడో ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఈసారి 49 మంది ప్రవాస భారతీయులు ఎన్నికల బరిలో నిలిచారు. లిబరల్‌ పార్టీ నుంచి 15 మంది, కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి 16 మంది ఉండగా ఇతర పార్టీలు కూడా భారతీయులకు టిక్కెట్లు ఇచ్చాయి.   

మరిన్ని వార్తలు