కరోనా కొత్త రూపాంతరాలు.. ‘బూస్టర్‌’ డోసు తప్పనిసరా? 

3 Aug, 2021 01:50 IST|Sakshi

రిచ్‌మండ్‌ (అమెరికా): కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లు (రూపాంతరితాలు) పుట్టుకొస్తున్న కొద్దీ... కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తర్వాత ఏమేరకు రక్షణ ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త వేరియంట్లు టీకా కల్పించే రక్షణ కవచాన్ని ఛేదిస్తాయా? టీకా కారణంగా ఎంతకాలం కోవిడ్‌–19 నుంచి రక్షణ లభిస్తుంది? రెండు డోసులు తీసుకున్నాక కూడా మరో బూస్టర్‌ డోసు అవసరమా? ఇలా పలు సందేహాలు ప్రజలను వేధిస్తున్నాయి. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టు, అంటువ్యాధుల నిపుణులు విలియం పెట్రి వీటికి సమాధానాలు ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. 

బూస్టర్‌ డోస్‌ అంటే ఏమిటి? 
వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధుల నుంచి రక్షణకు మనం వ్యాక్సిన్లు తీసుకుంటాం. సదరు వైరస్‌కు వ్యతిరేకంగా మన శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెంది... దానితో పోరాడి నిర్వీర్యం చేస్తాయి లేదా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. అయితే వ్యాక్సిన్ల ద్వారా లభించే రోగనిరోధకత సమయం గడిచినకొద్దీ బలహీనపడం సహజమే. ఉదాహరణకు ‘ఫ్లూ’ నిరోధానికి ఏడాదికోసారి వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. డిప్తీరియా, ధనుర్వాతానికి ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి. వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధకత స్థాయిని కొనసాగించేందుకు వీలుగా కొన్నాళ్ల తర్వాత ఇచ్చే అదనపు డోసునే ‘బూస్టర్‌ డోసు’ అని పిలుస్తారు. 

అప్పుడే అవసరమా? 
అమెరికాలో ఆరోగ్య సంస్థలు ఇప్పటివరకు బూస్టర్‌ డోసుపై అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. అయితే ఇజ్రాయెల్‌లో 60 ఏళ్లు పైబడిన వారు మూడోడోసు తీసుకోవాలని పోత్రహిస్తున్నారు. కరోనా బారినపడే ముప్పు అధికంగా ఉన్నవారికి (వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు) బూస్టర్‌ డోసు ఇవ్వాలనే దానిపై ఫ్రాన్స్‌లో సమాలోచనలు జరుగుతున్నాయి. 

రోగనిరోధక శక్తి తక్కువుంటే ‘బూస్టర్‌’ అవసరమా? 
స్టెరాయిడ్‌ల వాడకం వల్ల రోగనిరోధక శక్తి తగ్గినవారు, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్‌ డోస్‌ అవసరం. కిడ్నీ మార్పిడి జరిగిన 40 రోగుల్లో 39 మందిలో, డయాలసిస్‌ చేయించుకున్న వారిలో మూడోవంతు మందిలో (పరీక్షించిన శాంపిల్‌లో) వ్యాక్సినేషన్‌ తర్వాత యాండీబాడీల ఆచూకీ లేదని అధ్యయనంలో తేలింది. కిడ్నీ మార్పిడి చేసుకున్న రోగుల్లో బూస్టర్‌ తర్వాత యాంటీబాడీలు కనిపించాయి.

ఎందుకు సిఫారసు చేయడం లేదు? 
టీకా మూలంగా లభించే రక్షణ శాశ్వతం కానప్పటికీ... ఎంతకాలం ఉంటుందనేది ఇప్పటికైతే స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆమోదం పొందిన వ్యాక్సిన్లు అన్నీ మంచి రక్షణ కల్పిస్తున్నాయి. రోగకారక వైరస్‌ తాలూకు నిర్మాణాన్ని ‘బి లింఫోసైట్స్‌’ జ్ఞాపకం పెట్టుకుంటాయి. వైరస్‌ సోకితే... దాన్ని ఎదుర్కొనడానికి వెంటనే తగినంత స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. వ్యాక్సినేషన్‌ పూర్తయిన 11 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు కనపడటం ... బూస్టర్‌ డోస్‌ అప్పుడే అవసరం లేదనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి.

బూస్టర్‌ డోస్‌ అవసరమని మనకెలా తెలుస్తుంది? 
కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఏమేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా వైద్యులు ఐజీజీ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని ఫలితాన్ని బట్టి బూస్టర్‌ డోస్‌ అవసరమా? కాదా? అనేది తెలుస్తుంది. అయితే టీకా తీసుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్న కేసులు అధికం అవుతుండటంతో వైద్య పరిశోధకులు వ్యాక్సిన్స్‌ ద్వారా లభించే రోగనిరోధకత ఏస్థాయిలో ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? అనేది కచ్చితంగా తేల్చే పనిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు