ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా

15 Apr, 2023 07:47 IST|Sakshi

బీజింగ్‌: ఏడాదికి పైగా యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రకటించింది. చైనా మిత్ర దేశమైన రష్యా యుద్ధం కారణంగా సాయుధ సంపత్తిని భారీగా కోల్పోవడం తెలిసిందే. దాంతో రష్యాకు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేయవచ్చని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అలాంటి ఉద్దేశమేమీ తమకు లేదని చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ కాంగ్‌ శుక్రవారం ప్రకటన చేశారు.

పౌర, సైనిక వాడకం రెండింటికీ పనికొచ్చే వస్తువులను రష్యాకు ఎగుమతి చేయడంపైనా నియంత్రణ విధిస్తామన్నారు. యుద్ధంలో తమది తటస్థ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే యుద్ధం మొదలైనప్పటి  నుంచీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా రష్యాకు చైనా మద్దతుగానే నిలుస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చైనా దన్ను రష్యాకు ఎంతగానో ఆసరా అయింది. అదే క్రమంలో రష్యాకు ఆయుధాలు కూడా సమకూర్చేందుకు చైనా సన్నద్ధమవుతున్నట్టు తమకు నిఘా సమాచారముందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇటీవల పేర్కొనడం తెలిసిందే.
చదవండి: పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు

మరిన్ని వార్తలు