ప్రిన్స్‌ ఫిలిప్‌ మృతి: అంత్యక్రియలకైనా వస్తాడా.. లేదా?

9 Apr, 2021 17:34 IST|Sakshi

ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ల రాకపై చర్చ

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) శుక్రవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్‌హామ్‌ ప్యా​లెస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రిన్స్‌ ఫిలిప్‌ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్‌ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకుంటుంబాన్ని అభిమానించే వారి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. ప్రిన్స్‌ ఫిలిప్‌ మనవడు ప్రిన్స్‌ హ్యారి తాతను కడసారి చూడటానికి అయినా వస్తాడా.. లేదా అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంతరంగిక విబేధాల వల్ల ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మార్కెల్‌లు గత కొద్ది కాలంగా రాచ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో గత నెలలో ప్రఖ్యాత అమెరికన్‌ టీవీ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే టాక్‌ షోలో ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మార్కెల్‌లు తాము అంతఃపురంలో అనుభవించిన కష్ట నష్టాల గురించి ప్రపంచానికి వెల్లడించారు. జాతి వివక్షను ఎదుర్కొన్నానని.. మీడియా తనపై తప్పుడు కథల ప్రచారం చేసిందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మేఘన్‌ తెలిపారు. ఇక వీరి ఇంటర్వ్యూ ప్రసారానికి ముందే ప్రిన్స్‌ ఫిలిప్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాతను పరామర్శించాల్సిందిగా బకింగ్‌హామ్‌ ప్యాలేస్‌ హ్యారీకి సందేశం పంపింది. కారణాలు తెలియదు కానీ ప్రిన్స్‌ హ్యారీ మాత్రం తాతగారిని చూడటానికి రాలేదని సమాచారం. మరి ఇప్పుడు అంత్యక్రియలకు అయినా హాజరవుతాడా లేదా అనే ప్రశ్న బ్రిటన్‌ జనాలను తొలచివేస్తుంది. 

అయితే దీని గురించి రెండు నెలల క్రితమే ది రాయల్‌ అజ్బర్వర్‌ అనే పత్రిక ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్‌ హ్యారీని బ్రిటన్‌ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ప్రచురించడం గమనార్హం. ప్రస్తుతం హ్యారీ-మేఘన్‌ మార్కెల్‌లు అమెరికాలో నివాసం ఉంటున్నారు.

చదవండి: వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు