బంగ్లా పర్యటనలో మోదీకి ముప్పు లేదు

22 Mar, 2021 04:10 IST|Sakshi
బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ మొమెన్‌

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్పష్టీకరణ

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఈ వారాంతంలో పర్యటించ నున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎలాంటి భద్రతా పరమైన ముప్పు లేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని వామపక్ష సంస్థలు, కరడుగట్టిన ఇస్లాం గ్రూపులు మోదీ పర్యటనని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. బంగ్లాదేశ్‌ ఆవిర్భావం జరిగి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి మోదీ ఈ నెల 26,27న బంగ్లా పర్యటనకు వెళుతున్నారు. దేశ స్వాతంత్య్ర వేడుకలతో పాటు బంగాబంధు షేక్‌ ముజీబర్‌ రెహ్మాన్‌ శతజయంతి వేడుకలు కూడా జరగనున్నాయి.

కరోనా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాక మోదీ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ‘‘బంగ్లా పర్యటనకు మోదీని ఆహ్వానించడం మాకు గర్వకారణం. ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఏవో కొన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ల నిరసనలేవో వాళ్లని చేసుకోనిద్దాం. దానికి ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎ.కె. అబ్దుల్‌ మొమెన్‌ విలేకరులతో చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారని అన్నారు. బంగ్లాదేశ్‌ స్వర్ణోత్సవాలకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవుల దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు. విదేశీ ప్రతినిధులందరి రక్షణ బాధ్యత తమదేనని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని మొమెన్‌ చెప్పారు.  
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు