ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు

9 Nov, 2022 15:55 IST|Sakshi

ఆవకాయ పచ్చడి అంటే నోరూరని వారు ఎవరుంటారు. అలాంటి ఆవకాయ పచ్చడి ఒక మహిళను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే....ఇంగ్లాండ్‌కి చెందిన 57 ఏళ్ల మహిళ ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నప్పుడూ పొరపాటున ఆవకాయ బద్ద గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె హుటాహుటినా ఇంగ్లాంగ్‌లోని ఎప్పమ్‌ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులకు అసలు విషయం చెప్పి తాను తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నానని వివరించింది.

ఐతే వైద్యలు ఒక మెత్తని ఫ్రూట్‌ ఎలా ఇరుక్కుంటుందని కొట్టిపారేశారు. కానీ ఆ మహిళ తనకు చాలా ఇబ్బందిగా ఉందనడంతో.. ఆమెను పరీక్షించి చొంగకార్చుకునే అలావాటు ఉందని అందువల్ల మింగ లేకపోతుందని తేల్చి చెప్పారు. గొంతులో ఎలాంటిది ఇరుక్కోలేదని, గ్యాస్టిక్‌ సమస్య ఉన్నా ఇలానే ఉంటుందని అన్నారు వైద్యులు. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువగా ఉంటే రమ్మని చెప్పి ఆ మహిళను పంపించేశారు. ఆ తర్వాత సదరు మహిళ కేవలం నాలుగు రోజుల్లో మళ్లీ ఆస్పత్రికి వచ్చి జాయిన్‌ అయ్యింది.

ఈసారి ఆమె మరింత నొప్పితో మాట్లాడలేని స్థితికి చేరుకుంది. దీంతో వైద్యులు వెంటనే సీటీ స్కాన్‌చేసి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే స్కానింగ్‌లో ఆవకాయబద్ద గొంతులో గుచ్చుకోవడంతో అన్నవాహికలో నీరు చేరడం, ఛాతీలో గాలి ఉండటం వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి గొంతులో ఇరుక్కున్న ఆవకాయబద్దను తొలగించారు.

ఒక వారంపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండి చికిత్స తీసుకుంది. ఐతే ఆమె ఈ విషయమై ఆస్పత్రి ట్రస్ట్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో ట్రస్ట్ ఎలాంటి పళ్లు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలో వివరంగా ఒక జాబితా ఇవ్వాలని సదరు ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. ఇది చాలా హాస్యస్పదమైన విషయం, ఎందుకంటే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవించేవి అని డాక్టర్‌ రిచర్డ్ జెన్నింగ్స్ అన్నారు. సాధారణంగా మాంసం తింటే అందులోని ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకోవడం లేదా ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పగలం గానీ ఫలానా పండు వల్ల ఇలా జరుగుతుందని ఎలా చెప్పగలం అని అన్నారు. 

(చదవండి: చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష)

మరిన్ని వార్తలు