చింపాంజీతో సన్నిహితంగా నాలుగేళ్లు.. జూ నిర్ణయంపై విమర్శలు

23 Aug, 2021 10:36 IST|Sakshi

జూలో జంతువులను చూసి భలే ఉన్నాయంటూ మురిసిపోతాం. కోతులు, చింపాజీల వంటి జంతువులైతే అచ్చం మనిషిలాగే ఉంటాయని ఆనందపడతాము. ఖాళీ దొరికితే చాలు జంతుప్రేమికులు.. జూలను సందర్శిస్తుంటారు. అయితే తాజాగా బెల్జియంలోని ఆంట్వెర్ప్  జంతు ప్రదర్శనశాల ఓ సందర్శకురాలిపై నిషేధం విధించింది. దీంతో సదరు సందర్శకురాలు కన్నీటి పర్యంతం అయ్యిది. వివరాల్లో వెళ్తే.. బెల్జియంలోని ఆంట్వెర్ప్ జంతు ప్రదర్శనశాలను గత నాలుగేళ్లుగా ఏడీ టిమ్మర్‌మన్స్ అనే ఓ మహిళా సందర్శిస్తున్నారు.

అయితే ఈ క్రమంలో ఆమె జూకి వచ్చిన ప్రతిసారి ఆమె 38 ఏళ్ల ఓ మగ చింపాంజీని చూస్తూ కాలక్షేపం చేసేది. తరచుగా రావటంతో ఆ చింపాంజీ సదరు మహిళను గుర్తించడం మొదలుపెట్టింది. దీంతో వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో చింపాంజీ దాని సహచర చింపాంజీలో కలివిడిగా ఉండటంతో తగ్గించింది. ఒంటరిగా కూర్చోటంతో మిగతా చింపాంజీలు కూడా దాన్ని పట్టించుకోవటం మానేశాయి. దీంతో ఆ చింపాంజీలో వచ్చిన మార్పును జూ సిబ్బంది గమనించి.. దాని ప్రవర్తనకు గల కారణం ఆరా తీశారు. అయితే ఏడీ టిమ్మర్‌మన్స్‌  అనే మహిళ దాని వద్ద ఎక్కువ సమయం ఉండటం వారి దృష్టికి వచ్చింది. అయితే దాని ప్రవర్తనలోని మార్పుకు తీసుకురావడానికి సిబ్బంది.. ఆమెను జూకు రావొద్దని నిషేధం విధించారు.

దీంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతూ.. చింపాజీతో తనకు బంధం ఉందని తెలిపింది. మిగతా సందర్శకులను అనుమతించినప్పుడు తనను ఎందుకు రానివ్వడం లేదని జూ సిబ్బందిని ప్రశ్నించింది. ఆమెకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఉద్యమం నడుస్తోంది.  

మరిన్ని వార్తలు