వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ

5 Sep, 2021 10:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌: సాధారణంగా ఒక్కరోజు సరిగా నిద్రపోకపోతేనే ఆ ప్రభావం మన మీద చాలా దారుణంగా ఉంటుంది. రోజంతా చిరాకుగా... నిరుత్సాహంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న పని వాతావారణం, సాంకేతికత మన శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో రాత్రి ఎంత సమయం గడిచినా ఓ పట్టాన నిద్రపట్టదు చాలా మందికి. మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం.

ఇక నిద్రలేమితో బాధపడేవారు వైద్యులను సంప్రదించి.. చికిత్స తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ ఏకంగా 40 ఏళ్ల నుంచి నిద్ర పోవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదట. నిద్రమాత్రలు వేసుకున్నప్పటికి ప్రయోజనం లేదని వాపోతుంది. ఆ వివరాలు..

చైనా హెనాన్ ప్రావిన్స్‌లో నివసించే లి జ్యానింగ్‌ అనే మహిళ(45) గత 40 ఏళ్లుగా ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది. ఈ వింత జబ్బు ఆమెని ఒక్క సెకను కూడా నిద్రపోనివ్వడం లేదట. తనకు 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నిద్రపోయినట్లు గుర్తుందని.. ఆ తర్వాత ఈ వింత వ్యాధి బారిన పడటంతో ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని తెలిపింది జ్యానింగ్‌. (చదవండి: నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది )

ఈ విషయాన్ని జ్యానింగ్‌ భర్త కూడా అంగీకరించాడు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటివరకు జ్యానింగ్‌ నిద్రపోవడం తాను చూడలేదన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండటంతో టైం పాస్‌ కోసం ఇంటి పనులు చేయడం, టీవీ చూస్తూ గడుపుతుందన్నాడు. ఇక ప్రారంభంలో భార్యను ఈ సమస్య నుంచి బయటపడేయడం కోసం జ్యానింగ్‌ భర్త నిద్ర మాత్రలు కూడా తీసుకువచ్చాడట. కానీ అవి కూడా ఆమె మీద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. వాటిని వాడటం మానేసిందట. (చదవండి: రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!)

ఈ వింత జబ్బు వల్ల జ్యానింగ్‌ తన గ్రామంలో చాలా పాపులర్‌ అయ్యింది. ముఖ్యంగా జ్యానింగ్‌ను టెస్ట్‌ చేయడం కోసం చాలా మంది రాత్రి పూట ఆమె ఇంటికి వచ్చి.. పేకాట ఆడుతూ ఉండేవారు. అలా ఆడుతూనే వారికి తెలియకుండా నిద్రలోకి జారుకునేవారు. కానీ జ్యానెంగ్‌ మాత్రం అలానే మెలకువగా ఉండేదట. సమస్య పరిష్కారం కోసం జ్యానెంగ్‌ ఎన్నో ఆస్పత్రులను సందర్శించింది.. ఎందరో వైద్యులను కలిసింది. కానీ ఆమె సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..)

అయితే సాధారణంగా వారం రోజుల కంటే ఎక్కువ సమయం ఎవరు నిద్ర పోకుండా బతకలేరు. అలాంటిది జ్యానెంగ్‌ ఇన్నేళ్లు నిద్ర పోకుండా ఉంది అనే వార్తలను జనాలు పెద్దగా నమ్మడం లేదు. బహుశా ఆమెకు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.. పగటి పూట నిద్ర పోతుండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు