వినాయక విగ్రహాలు ధ్వంసం చేసిన ముస్లిం మహిళ

17 Aug, 2020 10:02 IST|Sakshi

మనామా: బహ్రెయిన్ సూపర్‌ మార్కెట్‌లో వినాయకుడి‌ విగ్రహాలు ఉంచడం పట్ల ఇద్దరు ముస్లిం ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేయడమే కాక సూపర్‌మార్కెట్‌ సిబ్బందితో గొడవపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నివేదికల ప్రకారం ఈ సంఘటన బహ్రెయిన్ రాజధాని మనమా పక్కనే ఉన్న జుఫైర్ ప్రాంతంలోని ఒక సూపర్ మార్కెట్‌లో జరిగింది. వివరాలు.. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని బహ్రెయిన్‌ జుఫైర్‌ సూపర్‌మార్కెట్‌లో గణేషుడి విగ్రహాలు అమ్మకం కోసం ఉంచారు. ఇది చూసిన ఇద్దరు ముస్లిం మహిళలు వినాయక విగ్రహాలను దూషించడమే కాక సూపర్‌మార్కెట్‌ సిబ్బందితో గొడవపడ్డారు.

అంతేకాక వారిలో ఓ మహిళ విగ్రహాలను ఒక్కొక్కటిగా నేలపై పడేసి ధ్వంసం చేసింది. ‘ఇది మహ్మద్‌ బెన్‌ ఇస్సా దేశం. అతను ఇతర మతస్తుల దేవుళ్లను అనుమతించాడని మీరు భావిస్తున్నారా. ఇది ముస్లిం దేశం.. ఇలా చేయడం సరియైనదేనా’ అంటూ ప్రశ్నించింది. మరొక మహిళ ‘పోలీసులను పిలవండి. ఈ విగ్రహాలను ఎవరు ఆరాధిస్తారో చూద్దాం’ అంటూ అవరడం వీడియోలో చూడవచ్చు. (ముంబైలో లాల్‌బ‌గ్చా గ‌ణేశ్‌ ఉత్స‌వాలు ర‌ద్దు)

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో బహ్రెయిన్ ప్రభుత్వం సదరు మహిళ మీద చర్యలు తీసుకుంది. ఈ మేరకు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ‘జుఫైర్లోని ఒక దుకాణంలో విగ్రహాలను ధ్వంసం చేసినందుకు.. ఒక సామాజిక వర్గాన్ని.. దాని ఆచారాలను అవమానించినందుకు 54 ఏళ్ల మహిళపై రాజధాని పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు’ అంటూ ట్వీట్‌ చేసింది. రాయల్ సలహాదారు ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఈ చర్యను ఖండించారు. దీనిని ‘ద్వేషపూరిత నేరం’గా వర్ణించారు. ‘మతపరమైన చిహ్నాలను నాశనం చేయడం బహ్రెయిన్ ప్రజల స్వభావంలో భాగం కాదు. ఇది ద్వేషాన్ని బహిర్గతం చేసే నేరం’ అంటూ అల్ ఖలీఫా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు