అయ్యో పాపం.. పొద్దున లేచేసరికి 20 ఏళ్లు తుడిచిపెట్టుకుపోయింది!

24 Feb, 2022 18:14 IST|Sakshi

జలుబు చేయడంతో ఓ మహిళ రాత్రి త్వరగా నిద్రలోకి జారుకుంది. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచింది. అందులో ఏముంది అనుకుంటున్నారా? పడుకొని లేచేసరికి ఆమె తన గతం మర్చిపోయింది. ఇంగ్లండ్‌కు చెందిన క్లైర్ మఫ్ఫెట్‌ రీస్ అనే మహిళ 2021లో ఓ రోజు తీవ్రంగా జలుబు చేయడంతో త్వరగా నిద్రలోకి జారుకుంది. అయితే పొద్దునలేచేసరికి ఆమె కోమాలోకి వెళ్లింది. సుమారు16 రోజులు కోమాలోనే ఉండిపోయింది.

కోమా నుంచి బయపడిన ఆమె దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయింది. ఇద్దరు పిల్లలు ఉ‍న్న క్లైర్ మఫ్ఫెట్‌కు మెదడువాపు వ్యాధి సోకడంతో తన గతం మర్చిపోయినట్లు ఆమె భర్త స్కాట్‌ చెప్పాడు. ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వ్యాపు వ్యాధి దినోత్సవం రోజున క్లైర్ మఫ్ఫెట్‌ తనకు జరిగిన ఈ ఘటనను వెల్లడించింది. 

రెండు వారాల నుంచి ఆమెకు జలుబు ఉంది. తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షిణించినట్లు స్కాట్‌ గుర్తించాడు. జలుబుతో పడుకున్న క్లైర్ మఫ్ఫెట్‌ పొద్దున నిద్రలేవలేదని.. అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోమాలోకి వెళ్లిన ఆమెకు వెంటిలేటర్‌ అమర్చి వైద్యులు చికిత్స అందించారు. అయితే వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమెకు మెదడువాపు వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

క్లైర్ మఫ్ఫెట్‌  మాట్లాడుతూ.. ‘నేను దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయాను. అయితే అదృష్టవశాత్తు నాకు పిల్లలు ఉ‍న్నారన్న విషయం గుర్తుంది. కానీ, వారికి నేను జన్మనిచ్చినట్టు, వారి పుట్టినరోజులు, అభిరుచులు, మొదటిసారిగా వారిని స్కూల్‌కు తీసుకెళ్లిన విషయాలు మర్చిపోయాను’ అని తెలిపింది. అయితే మరో అదృష్టకరమైన విషయం ఏమిటంటే.. తాను తన భర్తను మర్చిపోలేదని తెలిపారు. అలా జరిగి ఉంటే ఎలా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయినా తను ప్రస్తుతం​ సంతోషంగా ఉన్నానని తెలిపింది.

మరిన్ని వార్తలు