ప్రియుడి మోసం.. వెరైటీగా పగ తీర్చుకున్న గర్ల్‌ఫ్రెండ్‌

11 May, 2021 15:01 IST|Sakshi
మోసం చేసిన ప్రియుడికి బుద్ధి చెప్పిన థేయా లోవారిడ్జ్‌

ఫేస్‌బుక్‌లో వైరలవుతోన్న స్టోరీ

మహిళపై నెటిజనుల ప్రశంసలు

సాధారణంగా లవ్‌లో అమ్మాయిలు మోసం చేస్తే.. అబ్బాయిలు అస్సలు కామ్‌గా ఉండరు. తన మాజీ ప్రియురాలి గురించి అడ్డమైన చెత్తంతా ప్రచారం చేసి.. వారి పరువు తీసి సంతోషిస్తారు కొందరు. మరి కొందరు ఏకంగా ప్రియురాలి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడరు. అదే అమ్మాయి ప్రియుడి చేతిలో మోసపోతే.. ఎవరికి చెప్పుకోలేదు. తనలో తానే బాధపడుతుంది. ఏం చేయలేక మౌనంగా రోదిస్తుంది. అయితే అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటు. కొందరు తమను మోసం చేసిన వాడిని జైలుకు లాగుతారు. మరికొందరు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ తరహా వార్తనే. 

మోసం చేసిన ప్రియుడికి ఓ మహిళ ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. అతడిని జైలుకు పంపడంతోనే ఆగిపోలేదు. ఏకంగా అతడు చనిపోయినట్లు ప్రచారం చేసి.. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. సదరు మహిళ చేసిన పనికి నెటిజనులు అభినందిస్తున్నారు. ఆ వివరాలు.. థేయా లోవరిడ్జ్ అనే మహిళ, ఓ వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమిస్తుంది. వివాహం కానప్పటికి ఇద్దరు కలిసే ఉంటున్నారు. మొదట బాగానే ఉన్న థేయా బాయ్‌ఫ్రెండ్‌ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మరో మహిళను ప్రేమించాడు. దీని గురించి థేయాకు తెలియకుండా.. కొత్త ప్రియురాలితో కలిసి ఏంజాయ్‌ చేయసాగాడు. 

అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ తనను మోసం చేసి.. వేరే యువతితో తిరుగుతున్నాడని.. థేయాకు తెలిసింది. ఈ మోసాన్ని తట్టుకోలేకపోయింది. తనని మోసం చేసినందుకు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఓ మంచి ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. తన ప్రియుడి చెల్లెలని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సాయం చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆ యువతి కూడా అంగీకరించింది. ఈ క్రమంలో థేయా మొదట తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు పంపింది.

ఇక ఈ విషయాలు ఏవి తెలియని థేయా మాజీ ప్రియుడి కొత్త లవర్‌, అతడి మొబైల్‌కు అనేక సార్లు కాల్‌ చేసింది.. మెసేజ్‌లు పంపంది. కానీ ఎలాంటి రిప్లై రాలేదు. కొద్ది రోజుల పాటు ఆమెను ఇలా కంగారు పెట్టిన థేయా ఓ రోజు బాంబ్‌ పేల్చింది. ‘‘మీ బాయ్‌ఫ్రెండ్‌ చనిపోయాడు. ఈ రోజు అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి మెసేజ్‌ చేసింది. ఆమెను నమ్మించడం కోసం ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహించింది థేయా. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది. తన మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి అతడు జైలులో ఉన్నట్లు ఇప్పటికి తెలియదు. ఆమె ఇంకా అతడు చనిపోయాడనే భావిస్తుంది. ప్రతి ఏటా అతడి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుందని తెలిపింది థేయా. తనను మోసి చేసినందుకు అతడికి ఇలా జరగాల్సిందే అంటుంది.

ఇక ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చదివిన నెటిజనులు థేయాను అభినందిస్తున్నారు. మోసం చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకుండా తగిన బుద్ది చెప్పారు. మీరు చాలా మంది ఆడవారికి ఆదర్శం అని కామెంట్‌ చేస్తుండగా.. కొందరు మాత్రం మీ మాజీ ప్రియుడి కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌ అతడు చనిపోయాడని నమ్ముతుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంటే.. భవిష్యత్తులో చచ్చిపోయాడని భావించిన ఆమె లవర్‌ కళ్ల ముందు ప్రత్యక్షం అయితే ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: నోముల ఆడియో దుమారం

మరిన్ని వార్తలు