భర్తను అద్దెకిచ్చిన భార్య.. అవాక్కవ్వకండి, అక్కడే ఉంది అసలు విషయం

2 Jul, 2022 16:17 IST|Sakshi

భార్యేంటి.. భర్తను అద్దెకివ్వడమేంటని అవాక్కవ్వకండి. ఆమె భర్తను అద్దెకిచ్చింది... ఇల్లు రిపేర్, అలంకరణ, పునరుద్ధరణ వంటి పనులకోసం. సాధారణంగా ఇలాంటి పనులు ఎవరింట్లో వాళ్లే చేసుకోవచ్చు. కానీ కొందరికి సమయం దొరకదు. కొన్నిళ్లలో వృద్ధులు మాత్రమే ఉంటారు. ఇంట్లో పనులు చేసుకోలేరు. అలా అని పెద్ద వర్క్స్‌ చేసేవాళ్లకిస్తే ఎక్కువ చార్జ్‌ చేస్తారు. చిన్న పనికోసం అంత ఖర్చు చేయాలా అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి పనులను అద్భుతంగా చేసే తన భర్తను ‘హైర్‌ మై హ్యాండీ హబ్బీ’ పేరుతో అద్దెకిచ్చిందీ మహిళ. యూకేకు చెందిన లారా యంగ్‌కు ముగ్గురు పిల్లలు.

కుటుంబం బకింగ్‌హామ్‌ షైర్‌లో నివాసముంటోంది. అంతకుముందు వేర్‌హౌజ్‌లో పనిచేసిన ఆమె భర్త జేమ్స్‌.. ఆటిజంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి భార్య ఇబ్బంది పడటం చూసి ఉద్యోగం మానేశాడు. జేమ్స్‌ కార్పెంట్‌ వర్క్‌ అద్భుతంగా చేస్తాడు. పెయింటింగ్, అలంకరణ, టైల్స్‌ వేయడంలోనూ నిపుణుడు. తన ఇంటిని కూడా అలాగే సరికొత్తగా మార్చేశాడు. గది వైశాల్యాన్ని బట్టి బెడ్స్, కిచెన్, చెత్తనుంచి డైనింగ్‌ టేబుల్‌ ఇలా కొత్తకొత్తవాటిని సృష్టించాడు. గార్డెనింగ్‌లోనూ జేమ్స్‌ది అందెవేసిన చేయి. బంధువులు, స్నేహితుల ఇంటిని కూడా అందంగా తీర్చిదిద్దాడు.

రోజువారీ ఖర్చులు పెరగడంతో ఆ కష్టాలను అధిగమించడానికి జేమ్స్‌ చేయదగ్గ పార్ట్‌ టైమ్‌ వర్క్‌ ఇదొక్కటే అనుకుంది. మోటార్‌ మెకానిక్స్‌ చదవాలనుకుంటున్న జేమ్స్‌ సమయానికీ సరిగ్గా సరిపోతుంది. అందుకే ఫేస్‌బుక్, నెక్స్‌ట్‌ డోర్‌ యాప్‌లో ‘హైర్‌ మై హ్యాండీ హబ్బీ’ పేరుతో ప్రకటన ఇచ్చింది. అవసరమున్న కొందరు ఆసక్తి చూపారు. మరికొందరు ఇదేం పద్ధతంటూ పెదవి విరిచారు. ఎవరేమనుకున్నా.. తక్కువ ఖర్చుతో వాళ్లకు సహాయం, తాము  ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ముఖ్యమని చెబుతోంది లారా.  
చదవండి: Sri Lanka: పెట్రోల్‌ కోసం క్యూలో రోజుల తరబడి..

మరిన్ని వార్తలు