దురదృష్టం అంటే ఇదే.. 26 మిలియన్‌ డాలర్లు పోయాయి!

15 May, 2021 12:42 IST|Sakshi
Courtesy: CNN

కాలిఫోర్నియా: అదృష్ట దేవత తలుపు తట్టినా.. దరిద్రం నెత్తిమీద తాండవం చేస్తుంటే పరిస్థితి ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓ మహిళకు ఉచితంగా 26 మిలియన్‌ డాలర్లు ​(దాదాపు 190 కోట్ల రూపాయలు) కొట్టేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... గతేడాది నవంబరులో ఓ మహిళ నోర్‌వాక్‌లోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో సూపర్‌లాటో ప్లస్‌ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. దానిపై వచ్చే మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకునేందుకు మే 13 ఆఖరు తేదీ. 

అయితే, టికెట్‌ అయితే కొన్నది గానీ, దాని విషయం పూర్తిగా మరచిపోయింది సదరు మహిళ. ప్యాంటు జేబులో టికెట్‌ పెట్టుకున్న విషయం గుర్తులేక దానిని లాండ్రీకి వేసింది. కానీ.. క్లెయిమ్‌ చేసుకునేందుకు చివరి తేదీ అన్న ప్రకటన చూడగానే అసలు విషయం గుర్తుకువచ్చి కంగుతిన్నది. వెంటనే సదరు షాపునకు పరుగులు తీసింది. అప్పటికీ, ఇంకా ఎవరూ కూడా అమౌంట్‌ క్లెయిమ్‌ చేసుకోవడానికి రాలేదని తెలుసుకుని, తన నంబరుకే లాటరీ తగిలిందని, ఎలాగైనా డబ్బులు తనకే ఇవ్వాలని కోరింది. కానీ, టికెట్‌ చూపించకలేకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది.

ఈ విషయం గురించి లాటరీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘ఎవరైతే తాము లాటరీ గెలిచామని భావిస్తారో వారు కచ్చితంగా క్లెయిమ్‌ ఫాం పూర్తిచేయాలి​. అదే విధంగా టి​కెట్‌ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్‌ పోగొట్టుకున్నట్లయితే, దాని ఫొటోనైనా చూపించగలగాలి. లేదంటే మేమేమీ చేయలేం’’ అని పేర్కొన్నారు. ఇక నోర్‌వాక్‌ స్టోర్‌ మేనేజర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఆమె మా స్టోర్‌కు వచ్చారు. టికెట్‌ కూడా కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ మేం లాటరీ నిర్వాహకులకు పంపించాం. దీనిపై విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా దర్యాప్తులో గనుక సదరు మహిళ టికెట్‌ నంబరుకు లాటరీ తగిలిందని తేలనట్లయితే, ఆ మొత్తాన్ని కాలిఫోర్నియా పబ్లిక్‌ స్కూళ్లకు ఫండ్‌గా ఇస్తారు. 

చదవండి: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!

మరిన్ని వార్తలు