పోలీసు తూటాలకు బలైన మహిళ; అస్సలు ఊహించలేదు!

7 Jan, 2021 12:33 IST|Sakshi

వాషింగ్టన్‌: ‘‘మమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు.. వాళ్లు ప్రయత్నిస్తారు.. ప్రయత్నిస్తూనే ఉంటారు.. కానీ తుపానును అడ్డుకోలేరు... మరో 24 గంటల్లో డీసీలో ఇది జరుగబోతోంది... చీకటి నుంచి వెలుతురు వైపు’’ అంటూ క్యాపిటల్‌ భవన ముట్టడిలో తాను పాల్గొనబోతున్నట్లు మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది ఆషిల్‌ ఎలిజబెత్‌ బబిత్‌. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి మద్దతుదారురాలు ఆమె. సుమారు 14 ఏళ్లపాటు అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ సర్వీస్‌లో పనిచేసిన ఆషిల్‌ ప్రస్తుతం సాన్‌ డియాగోలో నివాసం ఉంటున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిని తట్టుకోలేని ఆమె బుధవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. జో బైడెన్‌కు అధికారం కట్టబెట్టే చట్టసభ ప్రతినిధుల సమావేశం జరుగకుండా అడ్డుకునే నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో క్యాపిటల్‌ భవనంలోకి దూసుకువెళ్లి పోలీసు తూటాలకు బలైపోయారు.(చదవండి: వాషింగ్టన్‌లో ఉద్రిక్తత: ట్రంప్‌కు షాక్‌..!)

అస్సలు ఊహించలేదు..
ఆషిల్‌ మరణంపై దిగ్భ్రాంతికి గురైన ఆమె కుటుంబ సభ్యులు.. తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాను ప్రేమించిన ఆమె ఈరోజు ఇలా శాశ్వతంగా తమను వీడి వెళ్లడం తీరని విషాదం అని విచారం వ్యక్తం చేశారు. తను నిజమైన దేశ భక్తురాలు అని ఆమె భర్త చెప్పుకొచ్చారు. అయితే వాషింగ్టన్‌ అధికారులు ఎవరూ తమను ఈ విషయమై సంప్రదించలేదని, మృతి చెందింది మాత్రం ఆషిలేనని పేర్కొన్నారు. కాగా ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన నేపథ్యంలో చెలరేగిన ఘర్షణలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఆమెను ఆషిల్‌ బబిత్‌గా గుర్తించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ.. ‘సే హర్‌ నేమ్‌’(ఆమె పేరు చెప్పండి) అంటూ ఆషిల్‌కు మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు