బ్యాంకు మేనేజర్‌కు బొమ్మ తుపాకీ ఎక్కుపెట్టి 10లక్షలు తీసుకెళ్లిన మహిళ.. హీరో అంటూ ప్రశంసల వెల్లువ..

15 Sep, 2022 20:13 IST|Sakshi

ఓ మహిళ గుంపుతో కలిసి బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి ప్రవేశించి హల్‌చల్ చేసింది. మేనేజర్‌కు ఆ తుపాకీ ఎక్కుపెట్టి 13,000 డాలర్లు(రూ.10లక్షలు) విత్‌డ్రా చేసింది. ఆ డబ్బునంతా పాస్టిక్ బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి క్షణాల్లో వెళ్లిపోయింది. లెబనాన్ రాజధని బెయరూత్‌లో ఈ ఘటన బుధవారం జరిగింది. సదరు మహిళ చేసిన పనిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ ఘటనకు పాల్పడిన మహిళ పేరు సలీ హఫేజ్. ఆమె తీసుకెళ్లిన డబ్బంతా తన సొంత సేవింగ్స్ ఖాతాలోదే కావడం గమనార్హం. తన ఖాతా నుంచి ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పక్కా ప్లాన్‌తో ఆమె ఈ పని చేసింది. కొంతమంది ఆందోళనకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఆర్థిక ఆంక్షలు..
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్‌లో 2019 నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు నెలకు 200 డాలర్లకు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు. దీంతో సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేక లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పెద్ద కారణం..
అయితే సలీ హఫేజ్ బొమ్మ తుపాకీతో బెదిరించి మరీ డబ్బు తీసుకెళ్లడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆమె 23ఏళ్ల సోదరి చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్సకు ప్రతినెలా చాలా డబ్బు అవసరం అవుతోంది. సేవింగ్స్ ఖాతాలో 20వేల డాలర్లు ఉన్నా వాటిని విత్ డ్రా చేసుకోలేక హఫేజ్ అవస్థలు పడింది. తన చెల్లికి క్యాన్సర్ అని చెప్పినా బ్యాంకు అధికారులు అసలు పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించలేదు. దీంతో కొంతమంది నిరసనకారులతో కలిసి హఫేజ్‌ బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకుంది.

ఇంటర్వ్యూలో వివరణ
తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీ హఫేజ్ వివరించింది. తన చెల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బు కావాలని, విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని బ్యాంకు అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యమైతే తన చెల్లి ప్రాణాలకే ప్రమాదమని చెప్పినా వినలేదని వాపోయింది. ఇక తాను కోల్పోవడానికి ఏమీ లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలా చేసినట్లు వివరించింది.

ప్రత్యక్ష సాక్షి భయం..
అయితే ఈ ఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం భయాందోళన వ్యక్తం చేసింది.  మొదట ఓ గుంపు బ్యాంకు లోపలికి వచ్చి నేలపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరించిందని, ఓ మహిళ బ్యాంకు మేనేజర్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి నగదు ఇవ్వకపోతే కాల్చిపడేస్తానని బెదిరించిందని చెప్పింది.

అయితే తాను ఎవరికీ హాని చేయాలనుకోలేదని హఫేజ్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. తన హక్కుల కోసమే గత్యంతరం లేక ఇలా చేసినట్లు స్పష్టం చేసింది. హఫేజ్‌కు లెబనాన్‌ ప్రజలంతా మద్దతుగా నిలిచారు. ఆమెను హీరోగా అభివర్ణించారు. ఆమె చేసినదాంట్లో తప్పేంలేదన్నారు.  మరోవైపు డబ్బు అవసరమైనవాళ్లు తనలాగే చేయాలని హఫేజ్ పిలుపునిచ్చింది.
చదవండి: నిమిషంలోపే హెయిర్‌ కట్‌.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్‌ డ్రస్సర్‌

మరిన్ని వార్తలు