గర్భవతని తెలియదు.. విమానంలో గాల్లో ఉండగానే డెలివరీ

3 May, 2021 17:18 IST|Sakshi
గర్భవతి అని తెలియకుండానే విమానంలో గాల్లో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన లావినియా

హవాయి(అమెరికా): కొన్ని సంఘటనల గురించి చదివినప్పుడు, విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇలా ఎలా జరుగుతుంది అనే అనుమానం కలుగుతుంది. వైద్యులు కూడా చాలా అరుదైన సంఘటన అంటారే తప్ప ఎలా సాధ్యమయ్యిందో వారు కూడా వివరించలేరు. ఇలాంటి అరుదైన సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చదివిన వారందరి మదిలే మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఇదేలా సాధ్యం. ఇంతకు అదేంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.. లావినియా మౌంగా అనే వివాహిత గత వారం తన కుటుంబంతో కలిసి హవాయికి వెళుతుండగా అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. బాధతో మెలికలు తిరిగింది. 

అంతసేపు బాగానే ఉన్న లావినియా ఇంత అకస్మాత్తుగా అస్వస్థతకు ఎలా గురయ్యిందో తెలియక కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆమె అదృష్టం కొద్ది అదే విమానంలో ముగ్గురు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నర్సులు, అలాగే వైద్యుడి సహాయకుడు, ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు. లావినాయ బాధ గమనించిన వారంతా ఆమె గర్భవతి అని.. పురిటి నొప్పులతో బాధపడుతుందని గ్రహించారు. వెంటనే ఆమెను విమానంలోని బాత్రూంకి తీసుకెళ్లి డెలివరీ చేశారు. అలా విమానం గాల్లో ఉండగానే లావినియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక డెలివరీ తర్వాత అందరిలో ఒకటే అనుమానం. సాధారణంగా గర్భవతులను విమానయానం చేయడానికి అనుమతించరు. అలాంటిది లావినియా ఆరు గంటల పాటు విమనంలో ప్రయాణించడానికి అధికారులు ఎలా అంగీకరించారు అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక లావినియా తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు తమ బిడ్డ గర్భవతి అని తమకే కాదు.. లావినియాకు కూడా తెలియదన్నారు. అసలు ఆమెలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని.. నెలలు నిండుతున్న కొద్ది ఉదర భాగం పెద్దదవ్వడం కూడా జరగలేదన్నారు. వారి సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఇక విమనాంలోని కొందరు ప్రయాణికులు తల్లి ముఖం కనిపించకుండా.. బిడ్డ ఏడుస్తున్న వీడియో తీశారు. కొద్ది క్షణాల క్రితం విమానంలో బిడ్డ జన్మించింది అని తెలిపారు. ఆ వెంటనే కొందరు శుభాకాంక్షలు తెలపడం.. చప్పట్లు కొడుతున్న శబ్దం వీడియోలో వినిపించింది. ఇక క్యాబిన్‌ క్రూ మానేజర్‌ కొద్ది క్షణాల క్రితమే విమానంలో ఓ బిడ్డ జన్మించింది. ఆ తల్లికి శుభాకాంక్షలు అని అరవడం కూడా వీడియోలో వినిపిస్తుంది. 

ఈ వీడియో వైరల్‌ అయిన తర్వాత లావినియా శనివారం తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘‘అత్యుత్తమంగా ఆశీర్వదించబడ్డాను’’ అంటూ ట్వీట్‌ చేసింది. విమానంలో సురక్షితంగా డెలివరీ జరిగిన తరువాత ఆమె తన బిడ్డకు రేమండ్ కైమనా వాడే కోబ్ లవాకి మౌంగా అని పేరు పెట్టింది. విమానం దిగిని వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న లావినియా తండ్రి దీన్నోక అద్భుతంగా వర్ణించాడు. ‘‘ఈ బిడ్డ జననం మమ్మల్నిద్దరిని షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం మేం పిల్లలు వద్దునుకున్నాం. అందువల్ల నా భార్య గర్భవతి అని నాకే కాదు తనకు కూడా తెలియదు’’ అన్నాడు లావినియా భర్త. 

చదవండి: వైరల్‌: గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం!

మరిన్ని వార్తలు