‘డబుల్‌’ జాక్‌పాట్‌..  

14 Jun, 2022 01:56 IST|Sakshi

ఎవరికైనా భారీ లాటరీ తగలడమంటే మామూలు విషయం కాదు.. వేల మంది లేదా కొన్ని రకాల లాటరీల్లోనైతే లక్షల మంది టికెట్లు కొంటే వారిలో ఏ కొందరినో అదృష్టం వరిస్తుంటుంది. అలాంటిది ఒకరికే రెండోసారి కూడా లాటరీ తగిలితే..! అది కూడా మొదటిసారి కొన్న షాపులో మళ్లీ టికెట్‌ కొన్న వ్యక్తినే జాక్‌పాట్‌ వరిస్తే...! అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఓ మహిళకు ఇలాగే అదృష్టం కలిసొచ్చింది.

2020లో ఆ మహిళ 20 రెట్లు ప్రైజ్‌మనీ అందించే ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. కొందరు బంధువులతో కలసి వెళ్లి ఓ కన్వీనియన్స్‌ స్టోర్‌ ప్రతినిధుల నుంచి ఆ టికెట్‌ కొన్నది. చివరకు లక్కీడ్రా తీయగా ఆమెకు రూ. 1.9 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఎగిరి గంతేసిన ఆమె ఆ సొమ్ముతో తనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంది. ఈ ఏడాది అదే లాటరీ సంస్థ మళ్లీ టికెట్లు అమ్మడంతో ఆవిడ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది.

గతంలో తన వెంట వచ్చిన బంధువులను మళ్లీ అదే స్టోర్‌కు వెంటబెట్టుకెళ్లింది. అలాగే తొలిసారి టికెట్‌ అమ్మిన ప్రతినిధుల చేతుల మీదుగానే మళ్లీ టికెట్‌ అందుకుంది. ఆశ్చర్యకరంగా ఆమెకు మళ్లీ జాక్‌పాట్‌ తగిలింది. ఈసారి లాటరీలో ఆమె రూ. కోటిన్నర గెలుచుకుంది. ఈ సొమ్ముతో మంచి ఇల్లు కొనుక్కుంటానంటూ ఎంతో మురిపెంగా చెప్పింది. 
– సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ 

మరిన్ని వార్తలు