శిథిలాల్లో 'అద్భుతం'.. 228 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడి..

16 Feb, 2023 13:12 IST|Sakshi

తుర్కియే, సిరిమాలో సంభవించిన వరుస భూకంపాలు మాటలకందని విషాదాన్ని నింపాయి. ఘోర విపత్తు తలెత్తి 9 రోజులు అవుతున్నా.. నేటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాల శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. వేలాది మంది విగతా జీవులుగా మారారు. మరికొందరు అయిన వారిని కోల్పోయి అనాథలుగా మిగిలారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి!

ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. మొత్తంగా భారీ భూకంపం రెండు దేశాల్లో పూడ్చుకోలేని నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే ఇప్పటికీ పలుచోట్ల చిన్నారులు, మహిళలతో సహా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి.  భూకంపం వచ్చిన 9 రోజుల తర్వాత కూడా ఇద్దరు మహిళలు సజీవంగా బయటపడ్డారు.

తుర్కియేలోని కహ్రామన్‌మారస్‌లో శిథిలాల కింద చిక్కుకున్న 45 ఏళ్ల మెలికే ఇమామోగ్లు, 74 ఏళ్ల సెమిలే కెకెక్‌ అనే ఇద్దరి మహిళలను రెస్క్యూ సిబ్బంది బుధవారం సురక్షితంగా బయటకు తీశారు. మహిళను రక్షించి అంబులెన్స్‌లో ఆసపత్రికి తరలిస్తున్న దృశ్యాలను డారికా మేయర్‌ ముజాఫర్‌ బియిక్‌ షేర్‌ చేశారు. మరోవైపు భూకంపాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన మరో తుర్కియే నగరం అంటాక్యాలో 228 గంటల తర్వాత (గురువారం) శిథిలాల కింద నుంచి ఎరిల్మాజ్ అనే మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను సజీవంగా బయటకు తీశారు. 

రక్షించిన సిబ్బందితో మొదటగా ఆమె ‘ఇది ఏ రోజు’ అని అడగటం గమనార్హం. అంతేగాక తుర్కియేలో ధ్వంసమైన భవనం శిథిలాల నుంచి ముస్తఫా అనే 13 ఏళ్ల బాలుడిని రక్షించారు. సుమారు 74 దేశాలకు చెందిన సహాయక బృందాలు ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తుర్కియే ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వార్తలు