World Food Day 2021: ప్రపంచంలో అతి ప్రాణాంతక మహమ్మారి ఇదే

15 Oct, 2021 14:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచ ఆకలి తీర్చడమే  వరల్డ్‌ ఫుడ్‌ డే  ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.  అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ  ప్రతీ ఏడాది లాగానే  ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్‌ను  నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం.

వరల్డ్‌ ఫుడ్‌ డే : చరిత్ర, ప్రాధాన్యత
ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) 1945లో  స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి.

దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం.  ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు.  ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా  96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న  మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు.  

2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా  సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన  చర్యల తో  అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌
మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్‌ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్‌లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్‌సైట్ గురువారం తెలిపింది.

అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ,  ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం  ప్రభుత్వాల విధి.

మరిన్ని వార్తలు