డబ్ల్యూఎఫ్‌పీకి నోబెల్‌ శాంతి బహుమతి

9 Oct, 2020 15:29 IST|Sakshi

స్టాక్‌హోం : ఆకలిపై పోరాడుతున్న ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ)కి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలిపై ఊపిరిసలపని పోరు సాగించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ చేపట్టిన సేవలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి దక్కిందని నోబెల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి నోబెల్‌ శాంతి బహుమతిని డబ్ల్యూఎఫ్‌పీకి అందించాలని తమ కమిటీ నిర్ణయించిందని నోబెల్‌ కమిటీ పేర్కొంది. యుద్ధ వివాదాలు, ఘర్షణలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి కోసం మెరుగైన వాతావరణం ఏర్పడేందుకు డబ్ల్యూఎఫ్‌పీ కృషి సాగించిందని తెలిపింది.

దీంతో పాటు ఆకలిని యుద్ధ ఆయుధంగా మలుచుకునే చర్యలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలకు గాను డబ్ల్యూఎఫ్‌పీకి ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించామని నోబెల్‌ కమిటీ ట్వీట్‌ చేసింది. డబ్ల్యూఎఫ్‌పీ ఏటా 88 దేశాల్లోని 9.7 కోట్ల మంది ప్రజలకు సాయపడుతోందని తెలిపింది. ఇక ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని పేర్కొంది. డిసెంబర్‌ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో 11 లక్షల డాలర్ల ప్రైజ్‌ మనీతో పాటు శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. కరోనా వైరస్‌తో ఆకలితో అలమటించే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌పీ సేవలు కొనియాడదగినవని నోబెల్‌ కమిటీ చీఫ్‌ బెరిట్‌ రీస్‌-అండర్సన్‌ ప్రశంసించారు.

చదవండి : బలహీనతను బలంగా వినిపించే కవిత్వం

మరిన్ని వార్తలు