India: ఆకలి రాజ్యం

6 Jun, 2021 19:15 IST|Sakshi

జూన్‌ 7న వరల్డ్‌ ఫుడ్‌ సేఫ్టీ డే

2019 నుంచి జరుపుతున్న యూఎన్‌వో

ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం

జూన్‌ 7న  ప్రపంచ ఫుడ్‌ సెఫ్టీ డేగా ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా నిర్వహిస్తోంది.  2019 నుంచి  ప్రపంచ ఆరోగ్య సంస్థ , యూఎన్‌వో, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఆహార భద్రతపై ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ఈ డే ముఖ్య  ఉద్దేశం.

వెబ్‌డెస్క్‌: సపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్‌ అంటూ ఆకలి రాజ్యం సినిమాలో కమల్‌ పాడిన పాట ఒక ఊపు ఊపింది. నలభై ఏళ్లు గడిచినప్పటికీ దేశం సందుగొందుల్లో ఆకలి కేకలు వినపడుతూనే ఉన్నాయి. ఆహార భద్రత చట్టం అమల్లోకి తెచ్చినా.. పట్టెడన్నం దక్కక లక్షల కుటుంబాలు  పస్తులుంటున్నాయి. వరల్డ్‌ ఫుడ్‌ సేఫ్టీ డే సందర్భంగా ఇండియాలో పెరిగిపోతున్న ఆకలిపై తీరుతెన్నులపై కథనం...

ఆకలి కేకలు 
2020లో ప్రకటించిన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆహార భద్రతకు సంబంధించి 107 దేశాల నుంచి డేటాను సేకరించి విశ్లేషించగా ఇండియాకు 102 స్థానం దక్కింది. 1991 నుంచి 2014 వరకు ఉన్న వివరాల ఆధారంగా 2020లో ఈ వివరాలు ప్రకటించారు. తమ దేశ పౌరుల ఆకలి తీర్చడంలో పొరుగు దేశాలపైన నేపాల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మొత్తం ఆసియాలోనే ఆఫ్ఘనిస్తాన్‌ ఒక్కటే మన కంటే వెనుకబడి ఉంది. పౌష్టికాహారం అందక పోవడం వల్ల ఎంతో మంది భావి భారత పౌరులు మరణం అంచులకు చేరుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ తిప్పలు
పేదరికం కారణంగా ఆకలితో నిత్య పోరాటం చేస్తున్న పేదల బతుకులపై లాక్‌డౌన్‌ సమ్మెట పోటులా మారింది. దేశంలో రెండు సార్లు విధించిన లాక్‌డౌన్‌తో పేదల బతుకులు చిధ్రమయ్యాయి. ఉపాధి కోల్పోయి తినే నాలుగు మెతుకులు కూడా లభించిన దుస్థితి నెలకొంది. ఇక వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వలస కార్మికులకు ఆహారం అందించేందుకు ఏ వాహానం వచ్చినా.. వందల సంఖ్యలో ప్రజలు ఆ వెహికల్‌ వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు సర్వ సాధారణం అయ్యాయి.

కల్తీ కంపు
సరిపడ ఆదాయం లేక ఆకలితో ఆలమటిస్తున్న వారు కొందరైతే.. డబ్బులు ఉన్నా నాణ్యమైన తిండి దొరక్క అనారోగ్యం పాలై ప్రజలకు కొదవ లేదు. ముఖ్యంగా నాన్‌వెజ్‌ వంటకాల విషయంలో కొన్ని రెస్టారెంట్లు అనుసరిస్తున్న ధోరణి దారుణంగా ఉంటోంది. కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచి సరఫరా చేస్తున్నారు. ఫుడ్‌సెఫ్టీ అధికారులు ఎన్ని సార్లు దాడులు చేసినా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు.

రోడ్లపైనే
కాళ్లకు వేసుకునే చెప్పులను అద్దాల షోరూమ్‌లో అమ్ముతుంటా కానీ కడుపుకు తినే కూరగాయలు మాత్రం రోడ్ల పక్కన, మోరీల వెంట అమ్మేస్తుంటాం అని అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్‌యాదవ్‌ చెప్పారు. ఇప్పటికీ ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. కనీసం మున్సిపాలిటీల్లో కూడా వెజ్‌, నాన్‌వెజ్‌కి సరైన మార్కెట్లు లేవు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. 

ఆహార భద్రత
యూపీఏ ప్రభుత్వ హయంలో తెచ్చిన ఆహార భద్రత చట్టం ఆకలితో ఆలమటించే పేదలకు అండగా ఉంది. ఈ చట్టం క్రింద ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని రెండు రూపాయలకే అందిస్తుండటంతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం సరఫరా చేసి ప్రజలను ఆదుకున్నారు. 

మరిన్ని వార్తలు