WHO: మరింత ప్రమాదకరంగా ఈ ఏడాది

15 May, 2021 19:49 IST|Sakshi
డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్

జెనివా: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దేశంలో విలయం సృష్టిస్తోంది. రోజుకు లక్షల కొద్ది కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక మహమ్మారి గురించి హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ మహమ్మారి వల్ల గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత ఘోరంగా ఉండనుంది అని హెచ్చరించింది. ఒలింపిక్స్ రద్దు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లో అత్యవసర పరిస్థితిని పొడిగించిన సమయంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.

"మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం మొదటిదానికంటే చాలా ప్రమాదకరంగా ఉండనుంది. మేం పరిస్థితులు సమీక్షిస్తున్నాం" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. 2019 చివరిలో వైరస్ మొదటిసారిగా వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా  33,46,813 మంది మరణించినట్లు అధికారిక డాటా వెల్లడిస్తుంది. 

ఒలింపిక్స్‌కు రద్దుకు పెరుగుతున్న డిమాండ్‌
ఇక టోక్యో ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచిన జపాన్‌లో కోవిడ్‌ విరుచుకుపడుతోంది. పోటీల నిర్వహణకు పది వారాల సమయం మాత్రమే ఉండగా తాజాగా దేశంలో మరో మూడు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే 3,50,000 మంది సంతకాలు చేసిన పిటిషన్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే టోక్యోలో ఎమర్జెన్సీ విధించగా. ఒలింపిక్ మారథాన్‌కు ఆతిథ్యమిచ్చే హిరోషిమా, ఓకాయామా ఉత్తర హక్కైడోలో తాజాగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక దేశంలో ఫోర్త్‌ వేవ్‌ ప్రవేశిస్తే.. అది వైద్య రంగాన్ని అతలాకుతలం చేస్తుందని.. ఇలాంటి వేళ ఒలింపిక్స్‌ నిర్వహించడం శ్రేయస్కరం కాదని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

చదవండి: 
తప్పుడు నిర్ణయాల వల్లే ఈ సంక్షోభం
Tokyo Olympics: ‘రాజకీయాలతో చంపేస్తారా’

మరిన్ని వార్తలు