ఒమిక్రాన్‌ ‘తీవ్రత’పై స్పష్టత లేదు

30 Nov, 2021 05:04 IST|Sakshi

అయినా హైరిస్క్‌ వేరియంట్‌గానే గుర్తింపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

ఐక్యరాజ్యసమితి/జెనీవా: కొత్త కరోనా వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాధి తీవ్రత ఎంతటి స్థాయిలో ఉంటుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచాన్ని చుట్టేసి జనజీవనాన్ని అతలాకుతలం చేసిన డెల్టా వేరియంట్‌ తరహాలో వేగంగా వ్యాప్తి చెందుతుందో లేదో అనే విషయాన్ని నిర్ధారించే సమాచారం తమ వద్ద లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ‘‘ప్రస్తుత సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా గుర్తిస్తున్నాం. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ సోకిన వారిలో భిన్నమైన వ్యాధి లక్షణాలు ఉంటాయని రూఢీ చేసే సమాచారమూ మా వద్ద లేదు. దక్షిణాఫ్రికాలో సాధారణంగానే కేసులు పెరిగాయా? లేదంటే ఒమిక్రాన్‌ వల్లే పెరిగాయా? అనే దానిపై పరిశోధనలు పూర్తికాలేదు’ అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

సమష్టి పోరుకు సిద్దంకావాలి
ఒమిక్రాన్‌ వంటి కొత్తకొత్త వైరస్‌ వేరియంట్లు ఉద్భవిస్తున్న ఈ తరుణంలో ‘అంతర్జాతీయ వేదిక’గా ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌పై ఉమ్మడి పోరుకు సిద్ధంకావాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. రాబోయే ఉపద్రవాలను పసిగట్టడం, ముందే సంసిద్ధమవడం, ధీటుగా ఆరోగ్య రంగాన్ని పటిష్టంచేయడం వంటి చర్యలతో మరో మహోత్పాతాన్ని ఆపాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రియేసిస్‌ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. జెనీవాలో జరుగుతున్న ‘వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ’లో ఆయన మాట్లాడారు. కోవిడ్‌పై ఉమ్మడి పోరాటానికి దేశాలన్నీ ఒక చట్టబద్ధ ఒప్పందం కుదుర్చుకో వాలని ఆయన సూచించారు.  ఒప్పందం ద్వారా ప్రపంచం ఏకతాటి మీదకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఒమిక్రాన్‌ గుర్తుచేస్తోం  దన్నారు.

విదేశీయులకు ద్వారాలు మూసేసిన జపాన్‌
ఒమిక్రాన్‌ జపాన్‌లో ఇంకా వెలుగుచూడకపోయినా ఆ దేశం అప్రమత్తమైంది. మంగళవారం నుంచి ప్రపంచ దేశాల పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించబోమని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా సోమవారం ప్రకటించారు. దేశ సరిహద్దుల వద్ద ఆంక్షలను పెంచారు. మరోవైపు, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య తాజాగా ఐదుకు పెరిగింది. బుధవారం నుంచి ప్రయాణ ఆంక్షలకు సడలించాలన్న నిర్ణయాన్ని మరో రెండు వారాలపాటు ఆస్ట్రేలియా వాయిదావేసుకుంది. డిసెంబర్‌ 15దాకా ప్రస్తుత ఆంక్షలే కొనసాగుతాయి. కాగా, పోర్చుగల్‌లో ఒమిక్రాన్‌ కేసులు పదమూడుకు పెరిగాయి.  బ్రిటన్‌లో ఈ రకం కేసుల సంఖ్య తాజాగా తొమ్మిదికి చేరింది. ఇంగ్లండ్‌లో ఇప్పటికే మూడు కేసులుండగా సోమవారం స్కాట్లాండ్‌లో ఆరు కేసులొచ్చాయి.

భారత్‌లో కనిపించని జాడలు
భారత్‌లో ఇప్పటిదాకా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ సోకిన ఒక్క కేసు కూడా నమోదుకాలేదని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. విదేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన వారి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఇటీవల విదేశాల నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఒక వ్యక్తి నుంచి సేకరించిన శాంపిల్‌.. డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉందని కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్‌ సోమవారం చెప్పారు. 63 ఏళ్ల ఆ వృద్ధుడి శాంపిల్‌లో ఉన్నది ఒమిక్రానా? మరేదైనా వ్యాధి లక్షణాలా? అన్నది ఐసీఎంఆర్‌ అధికారులే బహిర్గతం చేస్తారని ఆయన అన్నారు.  

మరిన్ని వార్తలు