అతిపెద్ద ఐస్‌బర్గ్‌ అంతర్ధానం!

17 Nov, 2022 06:19 IST|Sakshi

వాషింగ్టన్‌: భూతాపానికి ఫలితం ఈ ఉదాహరణ. అంటార్కిటికాలోని అట్లాంటిక్‌ తీరప్రాంతంలో ఉన్న రొన్నే మంచు పలక నుంచి విడివడిన ఒక భారీ ఐస్‌బర్గ్‌ త్వరలోనే కనుమరుగు కానుంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఐస్‌బర్గ్‌ 2021 మేలో విడిపోయాక మరో మూడు ముక్కలైంది. అమెరికాకు చెందిన టెర్రా ఉపగ్రహం ఈ ఐస్‌బర్గ్‌లోని అతిపెద్ద భాగం ఫొటో తీసింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం పయనించిన ఈ ఐస్‌బర్గ్‌ భారీ శకలం ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలోని కేప్‌ హార్న్‌కు, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్‌ దీవులు, ఎలిఫెంట్‌ దీవులకు మధ్యలోని డ్రేక్‌ పాసేజీలో ఉంది.

ఎ–76ఎ గా పిలుస్తున్న దీని పొడవు 135 కిలోమీటర్లు కాగా వెడల్పు 26 కిలోమీటర్లు.. లండన్‌ నగరానికి ఇది రెట్టింపు సైజు అని అమెరికా నేషనల్‌ ఐస్‌ సెంటర్‌ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది తన ఆకారాన్ని కోల్పోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, భూమధ్య రేఖ వైపు పయనించి అక్కడి సముద్ర జలాల వేడికి త్వరలోనే అంతర్థానం కానుందని అంటున్నారు. ఐస్‌బర్గ్‌లను సర్వసాధారణంగా బలమైన ఆర్కిటిక్‌ ప్రవాహాలు డ్రేక్‌ పాసేజ్‌ గుండా ముందుకు తోసేస్తాయి. అక్కడి నుంచి అవి ఉత్తర దిశగా భూమధ్య రేఖ వైపు పయనించి వేగంగా కరిగిపోతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు