Suez Canal: ఎవర్‌గివెన్‌ కన్నా పెద్ద నౌక ఎవర్‌ ఏస్‌ వస్తోంది!

15 Sep, 2021 16:18 IST|Sakshi

ప్రపంచ వాణిజ్య సముద్ర మార్గం సూయజ్‌ కెనాల్‌లోకి ప్రపంచంలోనే అతి పెద్దదైన భారీ ఓడ ప్రవేశించబోతోంది. ఈ ఏడాది మార్చిలో సూయజ్‌ కెనాల్‌లో నిలిచిపోయిన ఎవర్‌ గివెన్‌ నౌకను మించిన ఓడ ఇది. ఎవర్‌ గివెన్‌ నౌక ఆరు రోజుల పాటు సూయజ్‌ కెనాల్‌లో ఇసుకలో కూరుకుపోయి, నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వందలాది నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. ఆ తర్వాత నౌక కింద ఇసుకను తవ్వి, అతి కష్టంమీద దానిని మళ్లీ సముద్ర మార్గంలోకి మళ్లించగలిగారు. ఈ నౌక నిలిచిపోయిన కారణంగా సముద్ర వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగింది. ఇప్పుడు వస్తున్న ఎవర్‌ ఏస్‌ నౌక అంతకంటే పెద్దది. ఎక్కువ కంటెయినర్లను మోసుకొని వస్తోంది.
చదవండి: సూయజ్‌ కాలువ.. ఎవర్‌ గీవెన్‌ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?

ప్రస్తుతం ఇది బ్రిటన్‌లోని సఫోల్క్‌లో ఉన్న ఫ్లెగ్జిస్టోవ్‌ నౌకాశ్రయంలో ఉంది.  బుధవారం దాని ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భారీ కంటెయినర్ల లోడ్‌తో రాటర్‌డామ్‌కు చేరుకొనేందుకు ఎవర్‌ గివెన్‌ వెళ్లిన మార్గంలోనే సూయజ్‌ కెనాల్‌ గుండా వెళ్లనుంది. దీంతో అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఎవర్‌ గివెన్‌కంటే పెద్దదైన ఈ నౌక సూయజ్‌ కెనాల్‌ను దాటేంతవరకు ఉత్కంఠ తప్పదని వాణిజ్యవర్గాలు అంటున్నాయి.  తైవాన్‌కు చెందిన షిప్పింగ్‌ కంపెనీ ఎవర్‌ గ్రీన్‌ మెరైన్‌కు చెందిన ఈ నౌక ఎవర్‌గ్రీన్‌ ఎ క్లాస్‌లో కొత్త తరానికి చెందినది. ఎవర్‌ గివెన్‌కు 20,124 కార్గో యూనిట్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉండగా.. ఎవర్‌ ఏస్‌ ఏకంగా 23,992 కంటెయినర్లను మోసుకెళ్లగలదు. ఇవే కాదు ఈ రెండింటి మధ్య ఇంకా చాలా తేడాలున్నాయి. రెండింటి పొడవు ఒకటే. వెడల్పు, లోతులో, సామర్ధ్యంలో ఎవర్‌ ఏస్‌ ఎక్కువ. 

– సాక్షి, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు