జీ-20: కోవిడ్‌ కారణంగా మరో నేత మిస్‌.. పుతిన్‌, జిన్‌పింగ్‌ సహా..

8 Sep, 2023 08:00 IST|Sakshi

ఢిల్లీ: రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనుంది. కాగా, కోవిడ్‌ కారణంగా మరో నేత జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో జీ-20 సదస్సుకు ఆయన హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. దీంతో, మరో కీలక నేత సమావేశాలకు దూరమయ్యారు. 

వివరాల ప్రకారం.. జీ-20 సమావేశాలకు స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్‌ హాజరు కావడం లేదు. తాజాగా ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో సమావేశాలకు రావడంలేదని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా శాంచెజ్‌..‘గురువారం నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. జీ-20 సమావేశాల్లో స్పెయిన్‌ తరఫున వైఎస్‌ ప్రెసిడెంట్‌ నాడియా క్వాలినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్‌ మాన్యుయెల్‌ అల్బరేస్‌ ప్రాతినిధ్యం వహిస్తారని’ చెప్పారు. అలాగే, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) సహకారం ఉంటుందన్నారు. 


ముగ్గురు కీలక నేతలు గైర్హాజరు..
ఇదిలా ఉండగా.. ఢిల్లీ కేంద్రంగా జరుగనున్న జీ-20 సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇక, ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు ​వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ కూడా హాజరు కావడం లేదు. తాజాగా కోవిడ్‌ కారణంగా స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్‌   జీ-20 సమావేశాల్లో పాల్గొనడం లేదు. దీంతో, ముఖ్యమైన మూడు దేశాల నుంచి అధ్యక్షులు సమావేశాలకు హాజరు కావడం లేదు. 

మరోవైపు.. ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మొదలు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. 

జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్‌కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్‌. భారతీయ మూలాలున్న బ్రిటన్‌ ప్రధాని అయిన సునాక్‌ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్‌ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్‌ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్‌ శ్లాఘించారు.

ఇది కూడా చదవండి: ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?

మరిన్ని వార్తలు