ప్రపంచ అతి పొడవైన వేలాడే బ్రిడ్జి ఎక్కడుందో తెలుసా?

16 May, 2021 13:15 IST|Sakshi

మీకు భయమంటే ఎంటో తెలియదా? సాహసాలు చేయడమంటే ఇష్టమా? అయితే ఈ రెండింటినీ పరిచయం చేస్తానంటోంది పోర్చుగల్‌లోని  అరౌకా బ్రిడ్జి. ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే బ్రిడ్జిని ఇటీవల పోర్చుగల్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ‘బ్రీత్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ ఎయిర్‌’ లేదా ‘అరౌకా 516’గా దీన్ని పిలుస్తారు.

ఉత్తర పోర్చుగల్‌లోని పావియ నదిపై 175 మీటర్ల ఎత్తు (574 అడుగులు) లో నిర్మించిన అరౌకా బ్రిడ్జి పొడవు 516 మీటర్లు (1693 అడుగులు). అరకిలోమీటరు పొడువు ఉన్న అరౌకా.. వేళాడుతూ అగ్యిరాస్‌ జలపాతం నుంచి పావియా జార్జ్‌ను కలుపుతూ.. ‘అరౌకా జియోపార్క్‌’లో మంచి అడ్వెంచర్‌ స్పాట్‌గా మారింది.

2017లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభించిన ‘చార్లెస్‌ కుయోనెన్‌ సస్పెన్షన్‌’ బ్రిడ్జిను అరౌకా వెనక్కు నెట్టేసింది. ఇది  పరుచుకోనంత వరకు 494 మీటర్ల(1621 అడుగుల) పొడవుతో ‘చార్లెస్‌ కుయోనెన్‌ సస్పెన్షన్‌’ బ్రిడ్జే ప్రపంచలోని అతి పొడవైన వేలాడే వంతెనగా నడకసాగించింది.  ప్రస్తుతం ఆ ప్రస్థానాన్ని  516 మీటర్ల పొడవుతో అరౌకా కొనసాగిస్తోంది.

అందుకే అరౌకా..
యునెస్కో గుర్తింపు పొందిన అరౌకా జియోపార్క్‌ సమీపంలో ఈ బ్రిడ్జిను నిర్మించడంతో దీనికి అరౌకా అని పేరు పెట్టారు. 2018లో నిర్మాణం ప్రారంభించి 2020లో పూర్తి చేశారు. ఇది  ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జి అయినప్పటికీ కాస్త ఇరుకుగా ఉంటుంది. పోర్చుగీస్‌ స్టూడియో ఇటెకాన్స్‌  టిబేటన్‌ శైలీలో ఈ బ్రిడ్జి డిజైన్‌ను రూపొందించింది. ఈ వారధికి ఇరువైపులా ‘వి’ ఆకారంలో ఉన్న మూల స్థంబాల్లాంటి  రెండు టవర్లు ఉన్నాయి.

వాటి మధ్య స్టీల్‌ కేబుల్స్‌తో ఉంటుంది వంతెన  వేళాడుతూ.  నాలుగు మీటర్ల పొడవున్న 127 మాడ్యూల్స్‌ను ఉపయోగించి బ్రిడ్జి డెక్‌ను నిర్మించారు. డెక్‌కు రెండువైపులా నెట్‌తో రెయిలింగ్‌ను పటిష్ఠంగా అమర్చారు. అరౌకా నిర్మాణానికి మొత్తం 2.8 మిలియన్‌ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే మన రూపాయాల్లో అక్షరాల 20.68 కోట్లు.

గుండె గుబేలే..
ఈ వారధి నిర్మించక ముందు పర్యాటకులు అరౌకా జియోపార్క్‌ చూట్టు ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు వాహానాల మీద వెళ్లేవారు. ట్రెకింగ్‌ చేసేవారు.  ప్రస్తుతం ఈ బ్రిడ్జి ప్రారంభించడంతో పెద్దగా శ్రమపడకుండా హాయిగా నడకసాగించొచ్చు. అయితే  నడిచేటప్పుడు కిందకు చూస్తే మాత్రం గుండె గుబేలుమంటోందని స్థానికులు చెబుతున్నారు.

అరౌకా బ్రిడ్జి మొదలైన  తరువాత నడిచిన తొలి వ్యక్తి  హ్యూగో జేవియర్‌. వంతెన ఇవతలి నుంచి అవతలికి దాటిన తరువాత జేవియర్‌ మాట్లాడుతూ..‘‘ బ్రిడ్జిపై ఈ చివరి నుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పదినిముషాలు పట్టింది. బ్రిడ్జి మీద నడిచేటప్పుడు చాలా భయమేసింది.అయినా జీవితంలో మర్చిపోలేని అసాధారణమైన, ప్రత్యేకమైన అనుభూతి అది’’ అని  చెప్పాడు.
 
ఏంటీ మీరూ అక్కడకు వెళ్లాలనుకుంటు న్నారా! అయితే కరోనా తగ్గిన తరువాతే  కుదురుతుంది! అప్పుడు కూడా ఆరేళ్ల లోపు పిల్లలను బ్రిడ్జిమీదకు అనుమతించరు. పెద్దవాళ్లైనా  సరే గైడ్‌ను వెంటబెట్టుకుని వెళ్లాల్సిందే. సందర్శనకు 12 – 14 డాలర్ల రుసుము చెల్లించాల్సిందే!!
– పి. విజయా దిలీప్‌ 

మరిన్ని వార్తలు