పాపం యాన్‌ యాన్‌.. తిండి మానేసి మరీ కన్నుమూసింది

21 Jul, 2022 11:04 IST|Sakshi

హాంకాంగ్‌: ప్రపంచంలో అత్యంత వయస్కురాలైన మగ పాండా కన్నుమూసింది. 35 ఏళ్ల యాన్‌ యాన్‌(పాండా పేరు) హాంకాంగ్‌ ఓషన్‌ థీమ్‌ పార్క్‌లో మృతి చెందినట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే. దీని వయసు 35 ఏళ్లు కాగా, ఈ వయసు మనిషి వయసు 105 ఏళ్లకు సమానం. అత్యంత సున్నితమైన జీవరాశి జాబితాలో పాండాకు సైతం చోటు ఉంది.

యాన్‌ యాన్‌ 1999 నుంచి ఈ పార్క్‌లో ఉంటోంది. గత పదిరోజులుగా అది తిండి తగ్గిస్తూ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నా.. అది ఎందుకలా చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసినా.. ప్రయత్నాలు ఫలించలేదు. 

ఇంతకు ముందు అత్యధిక వయసున్న పాండాగా జియా జియా పేరిట రికార్డు ఉండేది. 38 ఏళ్ల వయసులో అది 2016లో కన్నుమూసింది. జియా జియా, యాన్‌ యాన్‌లను చైనా ప్రభుత్వం హాంకాంగ్‌ పార్క్‌కు కానుకగా ఇచ్చింది. 

పాండాల సంరక్షణకు మారుపేరుగా ఉన్న హాంకాంగ్‌లో.. వాటి జనాభా మాత్రం అంతగా వృద్ధి చెందడం లేదు. మరోవైపు చైనా నుంచే కానుకల రూపంలో వచ్చిన యింగ్‌ యింగ్‌, లే లే పాండాలతో సంతానోత్పత్తి చేయించాలన్న పదిహేనేళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు.

మరిన్ని వార్తలు