Kevin Carter Story: పేరు కోసం బతుకంతా అలాంటి ఫొటోలే! చివరికి..

19 Aug, 2021 07:55 IST|Sakshi
Vulture And The Child Photographer Kevin Carter Story

World Photography Day 2021: 1993 మార్చి 26 ఉదయం.. పబ్‌స్ట్‌ హోటల్‌లోని ‘న్యూయార్క్ టైమ్స్’ పేపర్​ హెడ్​ ఆఫీసులో ఫోన్​ మారుమోగుతోంది. రిసెప్షనిస్ట్ రెబెకా అవతలి నుంచి అడుగుతున్న ఒక్కటే ప్రశ్నకు.. ‘తెలీదండీ’ అనే సమాధానం చెప్పీ చెప్పీ విసుగెత్తిపోయింది. ఆ వెంటనే పార్ట్ టైం ఫొటోగ్రాఫర్​ కెవిన్​ కార్టర్​కు ఫోన్​ కాల్​ కలిపింది. ‘సర్.. ఆ పాప ఇంతకీ బతికి ఉందా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు ఏం చెప్పామంటారు’ అంటూ విసుగ్గా అడిగింది రెబెకా. ‘నేను ఆఫీస్​కు వస్తున్నా..’ అంటూ ఫోన్​ పెట్టేశాడు కెవిన్​. 

ఈ ప్రశ్న కెవిన్‌నూ చనిపోయేంత వరకు వెంటాడుతూనే వచ్చింది.  వాంటింగ్ ఏ మీల్.. ఆకలి కేకలతో బక్కచిక్కిన పసికందు.. ఆ వెనకాలే ఆకలితో పసికందు మరణం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాబందు.. ఇదీ కెవిన్‌ తీసిన ఫొటో. ఆ స్థితిలో అక్కడుంది ఒక్క రాబందు కాదు.. రెండు!. ఆ పాపకు పట్టెడు అన్నం పెట్టే పరిస్థితి ఉన్నా..  కనికరం లేకుండా కెమెరాలెన్స్ ఎక్కుపెట్టిన కెవిన్ కార్టర్‌ కూడా ఓ రాబందే.  యావత్​ ప్రపంచం నుంచి మానవత్వం ఈ విమర్శను ఎక్కుపెట్టింది. దిగజారిన ప్రొఫెషనల్​ ఫొటో జర్నలిజం పోకడకు అద్దం పట్టిన ఆ చిత్రం.. చరిత్రకెక్కింది.
 

1994 మే 23.. కొలంబియా యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో చప్పళ్ల మధ్య ‘వాంటింగ్ ఏ మీల్’ ఫొటోకు పులిట్జర్ అవార్డును స్వీకరించాడు కెవిన్. కానీ, ఆ ఫొటో తీసిన పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో కెవిన్​కు తన గతాన్ని గిర్రున తిరిగేలా చేసింది. ఎక్కడో యూరప్ నుంచి దక్షిణాఫ్రికాకు వలసవచ్చి స్థిరపడింది కెవిన్ కుటుంబం. కానీ, కెవిన్‌కు నల్లజాతీయులపై ఫుల్‌ సింపథీ ఉండేది. ఫార్మసీ చదివి.. అక్కడున్న రూల్స్‌ మూలంగా సైన్యంలో చేరాడు. ఓరోజు.. తన తోటి సైనికుడ్ని(నల్ల జాతీయుడ్ని) మిగతావాళ్లు కొడుతుంటే అడ్డుకున్నాడు. బానిసలను వెనకేసుకొస్తావురా... ‘ని** లవర్’ అంటూ వారు కెవిన్‌ను తన్నారు. ఆ అవమానం భరించలేక డర్బన్ పారిపోయాడు కెవిన్‌. ఉద్యోగం దొరక్క.. ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేర్పించడంతో ఎలాగోలా బతికి బట్టకట్టాడు. వేరే దారిలేక మళ్లీ జోహాన్నెస్ బర్గ్ కే వచ్చి సైన్యంలో చేరాడు. అక్కడ ఓ బాంబు పేలుడులో గాయపడి.. ఆర్మీ సర్వీసు నుంచి బయటికొచ్చాడు.
 

కెమెరాలతో సహజీవనం
మళ్లీ ఉద్యోగాల వేటలో ఓ కెమెరాల షాపులో పనికి కుదిరాడు. చుట్టూ కెమెరాలు.. లెన్స్‌లు కెవిన్‌కు ఇష్టం పెరిగింది. ఫొటోగ్రఫీలో అత్యంత కీలకమైన లైవ్​ క్యాప్చర్ మూమెంట్స్​ను తీయడమెలాగో నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు స్థానికంగా ఓ పత్రికలో పార్ట్ టైం స్పోర్ట్స్‌ ఫొటోగ్రాఫర్ గా చేరాడు. పేరుకే అందులో ఉన్నా.. సెన్సేషన్‌ కథనాలపైనే అతని ఫోకస్‌ ఉండేది. కెవిన్ అతని మరో ముగ్గురు స్నేహితులూ(ముగ్గురూ పొటోగ్రాఫర్లే) కలిసి.. దక్షిణాఫ్రికా ఉద్యమాన్ని చిత్రీకరించేవాళ్లు. అందరికంటే ముందుగా అక్కడ వాలిపోవడం, అరుదైన కోణాల్లో ఫొటోలు తీసి పత్రికలకు ఇవ్వడం.. కెవిన్​ అండ్​ కోకు బాగా అలవాటైంది. బ్యాంగ్​ బ్యాంగ్​ క్లబ్​ పేరు వచ్చేసింది వాళ్ల సాహసాలకు.  ఒకసారి నల్లవారు ఒక శ్వేత యువకుణ్ని పట్టుకుని విపరీతంగా హింసించి తగలబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించారు.

ఆ సీన్​తో కెవిన్‌లో భయాందోళనలు పెరిగాయి. దాని నుంచి ఊరట కోసం డ్రగ్స్​కు అలవాటుపడ్డాడు కెవిన్. 1991లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుదారులైన నల్లవాళ్లు.. ఓ శ్వేత జాతీయుణ్ని హత్యచేస్తుండగా తీసిన ఫొటోకు గాను కెవిన్ క్లోజ్‌ ఫ్రెండ్ ఊస్టర్ బ్రోక్ కు పులిట్జర్ అవార్డు వచ్చింది. స్నేహితుడి విజయం.. కెవిన్​లో అసూయను పెంచింది. ఎలాగైనా తాను పులిట్జర్​ కొట్టాలని కసిగా ప్రయత్నాలు చేశాడు.​ అందుకోసం మరో స్నేహితుడైన సిల్వాతో కలిసి సుడాన్ కరవును చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ తీసిందే ఈ పసికందు-రాబందు ఫొటో.
 

డిప్రెషన్​.. పశ్చాత్తాపం
ఆ తర్వాత కెవిన్‌ కెరీర్‌.. సిగ్మా, రాయ్ టర్స్ లాంటి ప్రముఖవార్తా సంస్థలతోనూ సాగింది. రిస్క్​ చేసి తీసిన ఫొటోలు.. ఫ్రంట్​ పేజీ ఫొటోలుగా ఇంటర్నేషనల్​ మాగజీన్​లలో పబ్లిష్​ అయ్యాయి. 1994 ఏప్రిల్ 18న కెవిన్.. తన మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి టొకోజా టౌన్ షిప్‌లో జరుగుతున్న అల్లర్లను చిత్రీకరించడానికి వెళ్లాడు. కానీ, హడావిడిగా ఏదో పని మీద మధ్యలోనే వెళ్లిపోయాడు. కాసేటికే అక్కడ కాల్పులు జరిగి ఊస్టర్ బ్రోక్ చనిపోయాడు. ఆ వార్త విని కెవిన్​ గుండె బద్ధలయ్యింది. డ్రగ్స్‌ను ఎక్కువగా వాడేశాడు. చేతిలో డబ్బులు లేవు. పైగా అప్పులు. భార్య అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఉద్యోగం రిస్క్‌లో పడింది.

‘తట్టుకోలేకపోతున్నాను.. ఫోన్ లేదు, డబ్బులేదు, అప్పులు... కళ్లముందే ఘోరమైన చావులు, బతుకుపోరాటాలు, హాహాకారాలు, ఆకలితో పేగులు మాడిన చిన్నారులు... విసిగిపోయాను. నాకింక శక్తి లేదు. అందుకే వెళ్లిపోతున్నాను... నా స్నేహితుడు ఊస్టర్ బ్రోక్ దగ్గరికి... అంతటి అదృష్టం నాకు ఉంటే’.. ఇది కెవిన్‌ కార్టర్‌ రాసిన సూసైడ్​ లేఖ.  1994, జులై 27.. చిన్నతనంలో ఎక్కడైతే ఆడుకున్నాడో.. అక్కడే తన వ్యాన్ సైలెన్సర్ కు ఒక పైపు బిగించి దాన్ని కిటికీ గుండా లోపలికి చేరవేసి బండి స్టార్ట్ చేశాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్ మెన్​లో తనకిష్టమైన పాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు. అలా ఆ విష వాయువుకు అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఏ ఫోటో అయితే అతనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిందో.. అదే అంతకు మించిన నిర్వేదాన్ని కెవిన్‌కు మిగిల్చింది.
 

కనిపించేంత దూరంలో ఆకలి తీర్చే కేంద్రం. కానీ, ఆ పసికందుకు ఓపిక లేదు. వెనుకనే రెక్కలు విప్పిన రాబందు
ఇద్దరి ఆకలి తీరడానికి కొన్ని అడుగులే దూరం...
ఎండలో ఎంతోసేపు చూసి విసిగిపోయిన కెవిన్​ ‘క్లిక్​’మనిపించాడు.
వాంటింగ్ ఏ మీల్...
ఎవరి ఆకలి తీరింది?

కోంగ్‌ న్యోంగ్‌.. ఆ పసికందు పేరు. అదృష్టవశాత్తూ ఆ పసివాడు బతికాడు. యూఎన్‌ శరణార్థ శిబిరానికి తరలించారు. ఆ ఫొటో వైరల్‌ తర్వాత చాలాకాలం శ్రమించిన ఓ స్పానిష్‌ న్యూస్‌ పేపర్‌(ఎల్‌ ముండో)కు న్యోంగ్‌ తండ్రి ఇంటర్వ్యూ దొరికింది. కానీ, అప్పటికే కెవిన్‌ చనిపోయాడు. మరోవైపు 2007లో న్యోంగ్‌.. వైరల్‌ ఫీవర్‌తో కన్నుమూశాడు. ఏదైతేనేం ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ఫొటోగా.. జర్నలిజానికి, తన జీవితానికి మాయని ఓ మచ్చగా మిగిలిపోయింది కెవిన్‌ తీసిన ఆ ఫొటో.

-ఆగష్టు 19.. వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా..

మరిన్ని వార్తలు