ఫిలిప్పీన్స్‌లో జన్మించిన ‘800 కోట్ల’ బేబీ

16 Nov, 2022 03:17 IST|Sakshi

గత 12 ఏళ్లలోనే 100 కోట్లు పెరిగిన జనం  

2023లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్‌  

ఐక్యరాజ్యసమితి/బీజింగ్‌: భూగోళంపై జనా భా మరో మైలురాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభా 800 కోట్ల మార్కును దాటేసింది. ‘800 కోట్ల’ శిశువు మంగళవారం భూమిపై కన్నుతెరిచింది. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జన్మించిన చిన్నారి పాపతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది వేడుక చేసుకోవాల్సిన సందర్భమేనని, అదే సమయంలో కోట్లాది మంది శాంతియుతంగా జీవించడానికి అనువైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో అందరూ ఆలోచించాలని సూచించింది.

‘‘800 కోట్ల ఆశలు, 800 కోట్ల స్వప్నాలు, 800 కోట్ల అవకాశాలు. మన భూ గ్రహం ఇక 800 కోట్ల మంది ప్రజలకు ఆవాసం’’ అంటూ ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(యూఎన్‌ఎఫ్‌పీఏ) ట్వీట్‌ చేసింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్య రంగంలో పురోగతి, అందరికీ విద్య వంటి అంశాల్లో మానవ జాతి సాధిస్తున్న విజయాలు ప్రపంచ జనాభా వృద్ధికి కారణాలని పేర్కొంది.  1800 సంవత్సరం వరకూ 100 కోట్లలోపే ఉన్న ప్రపంచ జనాభా మరో వందేళ్లలోనే 200 కోట్లకు చేరిందని ప్రకటించింది. యూఎన్‌ఎఫ్‌పీఏ

ఇంకా ఏం చెప్పిందంటే..  
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. వచ్చే ఏడాదికల్లా.. అంటే 2023లో జనాభాలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటుంది.  

► ప్రపంచవ్యాప్తంగా జనాభా గత 12 ఏళ్లలోనే 100 కోట్లు పెరిగింది.  

► కొన్నేళ్లుగా జనాభా వృద్ధి నెమ్మదించింది. అయినప్పటికీ 2037 నాటికి 900 కోట్లకు, 2057 నాటికి 1,000 కోట్లకు చేరుకోనుంది.   

► 2080 దశకం నాటికి జనాభా 1,040 కోట్లకు చేరుకుంటుంది. అదే గరిష్ట స్థాయి. 2100 సంవత్సరం దాకా పెద్దగా మార్పు ఉండదు.  

► 2023లో భారత్‌లో జనాభా సగటు వయస్సు 28.7 సంవత్సరాలు. ఇది చైనాలో 38.4, జపాన్‌లో 48.6 ఏళ్లు. ప్రపంచ జనాభా సగటు వయస్సు 30.3 ఏళ్లు. భారత్‌ యువ జనాభాతో కళకళలాడనుంది.  

► ప్రస్తుతం భారత్‌ జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2050లో భారత్‌ జనాభా 166.8 కోట్లు, చైనా జనాభా 131.7 కోట్లు కానుంది.   

స్థిరంగా భారత్‌ జనాభా వృద్ధి!  
న్యూఢిల్లీ:  భారత్‌ జనాభా వృద్ధిలో స్థిరత్వం ఏర్పడనుందని యూఎన్‌ఎఫ్‌పీఏ వెల్లడించింది. జనాభా పెరుగుదల ఎక్కువ, తక్కువ కాకుండా, స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ విధానాలు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు, కుటుంబ నియంత్రణ వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొంది. టోటల్‌ ఫెర్టిలిటీ రేటు (సగటున ఒక్కో మహిళ జన్మినిచ్చే శిశువుల సంఖ్య) 2.2 కాగా, రాబోయే రోజుల్లో ఇది 2కు పడిపోతుందని అంచనా వేసింది.

ఇదీ చదవండి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రధాన ప్రస్తావనగా..

మరిన్ని వార్తలు