World Refugee Day: బతుకు జీవుడా

20 Jun, 2022 06:41 IST|Sakshi

ప్రపంచంలో పెరిగిపోతున్న శరణార్థి సంక్షోభం 

శరణార్థుల్ని ఆదుకోవడానికి నిధులు కరువు

నేడు ప్రపంచ శరణార్థుల దినం  

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని కట్టుబట్టలతో కన్న భూమిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాది పెరిగిపోతున్న శరణార్థుల్ని చూసే దిక్కు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్‌ 20న ప్రపంచ శరణార్థుల దినం నిర్వహిస్తోంది.   

10 కోట్లు..
అక్షరాలా పది కోట్లు మంది ప్రపంచవ్యాప్తంగా.. ఉన్న ఊరుని విడిచి పెట్టి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషన్‌ ఆఫ్‌ రెఫ్యూజీస్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) తేల్చిన లెక్కలు ఇవి. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణచివేత, హింసాకాండ, మానవహక్కుల హననం వంటి కారణాలు దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్యను పెంచేస్తున్నాయి. కరోనా సంక్షోభం,    ఉక్రెయిన్‌పై రష్యా దాడి, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో బలవంతంగా వలస బాట పట్టినవారు ఎందరో ఉన్నారు.

ఏటికేడు శరణార్థుల సంఖ్య ఎలా పెరుగుతోందంటే వీళ్లందరూ ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే అది ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన 14వ దేశంగా అవతరిస్తుంది. అందులోనూ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.9 కోట్ల మంది శరణార్థులు ఉంటే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత వారి సంఖ్య 10 కోట్లు దాటేసింది ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభాలు  

ఉక్రెయిన్‌  
ఉక్రెయిన్‌పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చేస్తున్న భీకరమైన దాడులతో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇక అంతర్గతంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయిన వారు 80 లక్షల మంది వరకు ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థి సంక్షోభం రికార్డు స్థాయికి చేరుకుంది ఇప్పుడే. పోలండ్, రష్యా, రుమేనియా వంటి దేశాలు ఉక్రెయిన్‌ శరణార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. వారి అవసరాలు తీరుస్తున్నాయి.  

సిరియా  
దాదాపుగా పదేళ్ల పాటు అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియాలో 2021 చివరి నాటికి 67 లక్షల మంది సిరియన్లు శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టు, టర్కీ దేశాల్లో వీరంతా బతుకులీడుస్తున్నారు.  

అఫ్గానిస్తాన్‌
ఈ దేశం నుంచి నిరంతరం శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లేవారు చాలా ఎక్కువ. ప్రతీ పది మందిలో ఒకరు అక్కడ జీవనం సాగించలేక ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 26 లక్షల మంది శరణార్థి శిబిరాల్లోనే పుట్టారు.   

సూడాన్‌  
దక్షిణ సూడాన్‌లో నిరంతర ఘర్షణలతో ఇల్లు వీడి వెళ్లిన వారి సంఖ్య 40 లక్షలు ఉంటే, 26 లక్షల మంది దేశం విడిచి వేరే దేశాలకు వెళ్లిపోయారు.  

మయన్మార్‌
మయన్మార్‌లో రోహింగ్యాలను మైనార్టీల పేరుతో ఊచకోత కోస్తూ దేశం నుంచి తరిమి కొట్టడంతో ఏకంగా 10 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు.    
 
ఆదుకోవడం ఎలా?  
శరణార్థులుగా ఇతర దేశాలకు వెళుతున్న వారికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించడానికి ఆయా దేశాలు ఎంతో చేస్తున్నాయి. కానీ కేవలం అవి చేస్తే సరిపోవు. వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, కుటుంబం , స్థిరత్వం అన్నింటికంటే గుర్తింపు కూడా అత్యంత ముఖ్యం. ఇల్లు, దేశం విడిచి వెళ్లిన శరణార్థి ఇతర దేశాల్లో స్థిరపడడానికి కనీసం 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. శరణార్థులు కొత్త జీవితం గడపడానికి అవసరమైన నిధులు అందడం లేదు. ప్రతీ ఏడాది మానవీయ సంక్షోభాలు లెక్కకు మించి వస్తూ ఉండడంతో కనీసం వెయ్యి కోట్ల డాలర్లు (రూ.77,000 కోట్లు) లోటు ఉంది. యెమెన్, అఫ్గానిస్తాన్, సూడాన్‌లో శరణార్థులుగా మారిన వారిలో మూడో వంతు మందికి కూడా సాయం అందలేదని యూఎన్‌ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ కాకుండా నిత్యం శరణార్థుల్ని పుట్టించే 30 ఘర్షణాత్మక ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. శరణార్థుల్లో సగానికి సగం మంది పిల్లలే ఉండడం ఆందోళనకరం. వారిలో ఒక్క శాతం మందికి కూడా సాయం అందడం లేదు. సంపన్న దేశాలు ఇకనైనా శరణార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
    
–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు