ఈ భూమిపై మాకింత చోటేది?

20 Jun, 2021 14:06 IST|Sakshi

శరణార్థుల ఉత్పత్తి దేశంగా సిరియా

ప్రపంచ వ్యాప్తంగా 65.3 మిలియన్ల మంది నిరాశ్రయులు

18 ఏళ్లలోపు శరణార్థులుగా ఉన్నవారు 51శాతం

ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది. ఒకప్పుడు విదేశీయుల ఏలుబడిలో ఉన్న దేశాలు స్వాతంత్య్రం సాధించుకున్నాయి. తమ పాలకులను, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ కొన్ని దేశాల్లోని ప్రజలకు ఆ స్వాతంత్య్ర ఫలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. బాధ వస్తే కన్నీళ్లు కార్చడం, ఆకలి వేస్తే పొట్ట చేత పట్టుకోవడం అక్కడ ప్రజలకు సర్వసాధారణం. ఎందుకంటే.. ప్రపంచంలోని అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. 2001 నుంచి ఐక్యరాజ్య సమితి, 100కి పైగా దేశాలు జూన్‌ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతున్నాయి. మరి ఆ కన్నీటి గాథలు ఓసారి తెలుసుకుందాం!

  • యూఎన్‌హెచ్‌సీఆర్‌ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 65.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో 21 మిలియన్లకు పైగా ప్రజలు శరణార్థులుగా వివిధ దేశాలకు వలస వెళ్లారు. ఇప్పటికీ 10 మిలియన్ల మందికి సరియైన ఉందామంటే గూడు లేదు.
  • రోజుకు సగటున 42,500 మంది రక్షణ కోసం తమ ఇళ్లను వదిలి ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. గత సంవత్సరం 13.9 మిలియన్ల మంది కొత్తగా నిరాశ్రయులయ్యారు.
  • ఇక సిరియాలో అంతర్యుద్ధం అక్కడి ప్రజల జీవితాల్లో అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం 11 మిలియన్లకు పైగా సిరియన్లు నిరాశ్రయులయ్యారు. ఇది సిరియా జనాభాలో 45శాతం.
  •  ప్రపంచంలోని 86శాతం శరణార్థులకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. గత దశాబ్దంలో వివిధ దేశాలకు శరణార్థులుగా వేళ్లే వారి సంఖ్య 16 శాతం  పెరిగింది.
  • ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థుల శిబిరం కెన్యాలోని దాదాబ్‌లో ఉంది. అక్కడ దాదాపు 3,29,000 మందికి పైగా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే గతంలో భద్రతాపరమైన ప్రమాదాల కారణంగా దాదాబ్ శరణార్థుల శిబిరాన్ని మూసివేస్తామని అన్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 మిలియన్ల శరణార్థులలో 18 ఏళ్లలోపు ఉన్నవారు 51 శాతం. రెండవ ప్రపంచ యుద్థ తరువాత అత్యధిక సంఖ్యలో బాలలు శరణార్థులుగా మారడం ఇదే ప్రథమం.
  • ఇక 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌ పోటీలో మొట్టమొదటిసారిగా ‘‘శరణార్థుల జట్టు’’ పోటీ పడింది. ఈ జట్టులో ఇథియోపియా, దక్షిణ సూడాన్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
  • ప్రపంచ దేశాల్లోని శరణార్థుల్లో ప్రధానభాగం సిరియా, అఫ్గానిస్థాన్‌, దక్షిణ సూడాన్‌, పాలస్తీనా, ఇరాక్‌, ఉగాండా, సోమాలియా, మయన్మార్‌లలోనే ఉన్నారు. ఇప్పటికీ సిరియాను 'శరణార్థుల ఉత్పత్తి దేశం'గా పిలుస్తారు.

ప్రపంచీకరణ కారణంగా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, విదేశాంగ దౌత్య సంబంధాలు, భూభాగ సరిహద్దుల అంశాల్లో కట్టుదిట్టమైన విధానాలను అవలంబిస్తున్నారు. కొన్ని దేశాల్లో సరిహద్దు భూభాగంలో ఇనుప కంచెల ఏర్పాటు, గట్టి భద్రత, పౌరసత్వ గుర్తింపు తనిఖీ, నియంత్రణ కోసం గస్తీ బలగాలను పెద్దఎత్తున మోహరిస్తున్నారు. ప్రధాన రహదారులనూ మూసివేస్తూ, శరణార్థులు చొరబడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఐరాస చొరవతో ప్రపంచంలోని అన్ని దేశాలతో చర్చలు జరిపి, ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు ప్రాణరక్షణ, పునరావాసం, విద్య, వైద్యం, ఆహారం, మందులు, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి, జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు అంత పరిహారం ఇవ్వలేం: కేంద్రం

మరిన్ని వార్తలు