World Sparrow Day 2023: పిచ్చుల గురించి ఈ ప్రత్యేక విషయాలు మీకు తెలుసా?

20 Mar, 2023 13:10 IST|Sakshi

వేకువ జామున కిలకిలారావాలతో మేలుకొలుపు పాడే పిచ్చుకలను చూస్తే మనసుకు కాసింత హాయి.. చూరుకు వేలాడదీసిన వరి కంకులు తింటూ ‘కిచ కిచ’ మంటూ గోల చేసే చిట్టి పిట్టలు కలిగించే ఉత్సాహం మాటల్లో చెప్పలేం.! ఇసుక, మట్టిలో పొర్లాడే దృశ్యాలు.. అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ పిట్టలు సందడి చేసిన క్షణాలు ఎంతో మందికి తీపి జ్ఞాపకాలు.

మనిషికి దగ్గరగా ఉంటూ మన కుటుంబంలో ఒకరుగా ఉన్న పిచ్చుకలు.. మానవజాతి చేస్తున్న తప్పిదాలకు బలైపోతున్నాయి. ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న పక్షుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న పిచ్చుకలను రక్షించుకోకపోతే జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వాటి విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

పూర్వం మధ్యదరా ప్రాంతంలో ఆవాసముండే పిచ్చుకలు కాలక్రమంలో ప్రపంచమంతటా విస్తరించాయి. అడవుల్లో కాకుండా మానవులకు దగ్గరగా ఉండేందుకే అవి ఇష్టపడతాయి. గూడుకు ముప్పు వస్తుందనుకుంటే ఇతర జాతుల పక్షులపై దాడి చేసేందుకూ వెనుకాడవు. మగ, ఆడ పిచ్చుకలు అదే వర్గానికి చెందిన పక్షులపై మాత్రమే దాడి చేయడం ఇక్కడ విశేషం.

►65 ఏళ్ల క్రితం అంటే 1958లో చైనా పాలకుడు మావో జెడాంగ్‌ పిచ్చుకలపై బ్రహ్మస్త్రం సంధించాడు. పంటలు నాశనం చేస్తున్నాయనే నెపంతో లక్షల సంఖ్యలో పిట్టలను కాల్చిపడేయించాడు. పంటల వద్ద పళ్లేలతో చైనీయులు చేసిన శబ్ధాల ధాటికి పిచ్చుకలు బతుకుజీవుడా అనుకుంటూ దూరంగా వెళ్లి తలదాచుకున్నాయి.

►ఆ తర్వాత పంటలను చీడపీడలు ఆశించడంతో తిండిగింజలు కరువయ్యాయి. రెండేళ్లలోనే తాము చేసిన తప్పు చైనీయులకు తెలిసొచ్చింది. పిట్టలు బతికుంటేనే పంటకు రక్ష అని గుర్తించిన చైనీయులు వాటిని సంరక్షించడం మొదలుపెట్టారు. జీవవైవిధ్యానికి పిచ్చుకలు ఎంతలా దోహదపడతాయో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ.  

ఖండాలు దాటి వచ్చే చిన్ని పిచ్చుక.. 
►చూడటానికి పిచ్చుకల్లా ఉండే ఈ పక్షులు ఏటా శీతాకాలంలో పశ్చిమ దేశాల నుంచి నల్లమల అభయారణ్యానికి లక్షల సంఖ్యలో వలస వస్తుంటాయి. వీటితోపాటు వలస వచ్చే హారియర్స్‌ అనే గద్ద జాతి పక్షులు గ్రేటర్‌ షార్ట్‌ టోడ్‌ లార్క్‌లను వేటాడి తింటాయి. 

►పిచ్చుకలు అంతరించిపోతుండటానికి కారణాలు అనేకం. భూతాపోన్నతి నుంచి రక్షణ కోసం మానవ జాతి వినియోగిస్తున్న అన్‌లెడెడ్‌ పెట్రోల్‌ అందులో ఒకటి. ఈ పెట్రోల్‌ను మండించినప్పుడు విడుదలయ్యే మిౖథెల్‌ నైట్రేట్‌.. చాలారకాల క్రిమికీటకాలకు విషంలా మారుతోందని, ఫలితంగా పిచ్చుకలకు ఆహారం దొరకకుండా పోతోందని ఆర్నితాలజిస్టులు(పక్షి శాస్త్రవేత్తలు) తమ పరిశోధనల ద్వారా గుర్తించారు.

►పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ శైలి మారడంతో పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశాలు తగ్గాయి. పెరటి తోటలు అంతంతమాత్రంగా ఉండటం, వాహనాల రణగొణధ్వనులు, సెల్‌ టవర్ల రేడియేషన్, పంటల సాగులో రసాయనాలు అధికంగా వినియోగించడం తదితర కారణాలు పిచ్చుకల జీవనానికి ముప్పుగా పరిణమించాయి.  

►ప్రపంచంలో ఏటా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ తయారు చేసిన రెడ్‌లిస్ట్‌ జాబితాలోకి పిచ్చుకలను చేర్చింది. మన దేశంలోనూ పిచ్చుకల్ని సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నాలు  చేస్తున్నాయి.  

పిచ్చుకల జీవిత కాలం నాలుగు నుంచి ఐదేళ్లు.
► బరువు 35 నుంచి 40 గ్రాములు.
►ఎగిరే వేగం గంటకు 38.5 నుంచి 50 కి..మీ. 
►ఐదు నుంచి ఎనిమిది గుడ్లు పెడతాయి. 10 నుంచి 15 రోజుల్లో పొదుగుతాయి.  
►ప్రత్యర్థుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలో ఈదగలదు. 
►ఆడ పిచ్చుకల్ని ఆకర్షించేందుకు మగ పిచ్చుకలే గూళ్లు కడతాయి.   

మరిన్ని వార్తలు