ఆజానుబాహుల దేశంగా పేరు.. కానీ పొట్టిగా అయిపోతున్నారు!

15 Oct, 2021 16:00 IST|Sakshi

‘మా తాత ఆరు అడుగుల ఆజానుబాహుడు తెలుసా?’ అని ఎవరన్నా అంటే ‘హా..అయితే మరి నువ్వేంట్రా ఇంతే ఉన్నావ్‌?’ అనే మాటలు తరచుగా వింటూనే ఉంటాం. తాతలు పొడుగ్గా ఉంటే ఆ వంశీకులు కూడా పొడవుగానే అవుతారు. అది డీఎన్‌ఏను బట్టి ఉంటుంది. కానీ ఒకప్పుడు ఆరు అడుగుల పొడుగు ఉండేవారు. కాలం, తరాలు గడుస్తున్న కొద్దీ ఆ వంశంలో పుట్టిన వారు పొడవు తగ్గిపోతుంటారా? అంటే  నిజమేనంటోంది ఓ సర్వే. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడుగైన వారిగా పేరొందిన నెదర్లాండ్స్‌ దేశస్థులు ఇప్పుడు అంత పొడవు పెరగడం లేదట.. పైగా పొడవు తగ్గిపోతూ..పొట్టిగా అయిపోతున్నారట. వారు ఎందుకు పొడవు తగ్గిపోతున్నారో తెలుసుకుందామా.?

ఒకప్పుడు ఆరడుగుల ఆజానుబాహులకు నెదర్లాండ్స్‌ పెట్టింది పేరు. ఆ దేశంలో పుట్టే పురుషులతో పాటు మహిళలు కూడా ఆరేడు అడుగుల ఎత్తు ఉండేవారు. అందుకే ప్రపంచంలో పొడవైన వ్యక్తులున్న దేశంగా ‘నెదర్లాండ్స్‌’ గుర్తింపు సాధించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జనాభా కలిగిన దేశంగా గత 6 దశాబ్దాలుగా ఈ రికార్డు నెదర్లాండ్‌ పేరిటే ఉంది.

ఇప్పుడు ఆ రికార్డుకు ఆ దేశం క్రమంగా దూరమవుతున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టమైంది. మునుపటి తరంతో పోల్చితే ఆ దేశస్థులు క్రమంగా పొడుగు తగ్గిపోతున్నారు. 1980లో పుట్టిన వారితో పోలిస్తే 2001లో పుట్టిన వారు పొట్టిగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ భూ ప్రపంచంలో ఇప్పటికీ ఎక్కువ ఎత్తున్న జనాభా కలిగిన దేశంగా నెదర్లాండ్స్‌ నిలవడం విశేషం. ప్రస్తుతం ఆ దేశంలో 19 ఏళ్ల యువకుడి సగటు ఎత్తు 6 అడుగులు (182.9 సెం.మీ) కాగా, యువతి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు (169.3 సెం.మీ)గా ఉంది. 1980లో పుట్టిన మునుపటి తరంతో పోల్చితే 2001లో పుట్టినవారు సరాసరిగా కనీసం 1 సెంటీ మీటర్‌ ఎత్తు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మహిళలు 1.4 సెం.మీ మేర ఎత్తు తగ్గిపోయారు. ఆ దేశంలోని 19 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 7,19,000 మంది ఎత్తుపై ఈ సర్వే నిర్వహించారు.          
– సాక్షి, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

ఎత్తు తగ్గడానికి కారణాలివే....
నెదర్లాండ్స్‌ ప్రజలు ఎత్తు తగ్గిపోవడానికి గల కారణాలను ఆ దేశ ప్రభుత్వ సంస్థ సీబీఎస్‌ విశ్లేషించింది. సరైన పౌష్టికాహారం తీసుకోనందునే వారు క్రమంగా ఎత్తు తగ్గిపోతున్నట్లు పేర్కొంది. పౌష్టికాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే తరం ఎత్తు మరింత తగ్గిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెదర్లాండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో ఆ దేశంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తద్వారా అప్పట్లో చిన్నారులు సరైన పౌష్టికాహారానికి దూరమై ఉండవచ్చని భావిస్తున్నారు. అది వారి ఎత్తు తగ్గడానికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బాల్యంలో సరైన వసతులు లేకపోవడం కూడా వారి ఎత్తును ప్రభావం చేస్తుందని పేర్కొన్నారు
 

మరిన్ని వార్తలు