నాసా విద్యుత్‌ విమానం వచ్చేస్తోంది

3 Feb, 2023 06:21 IST|Sakshi

కేంబ్రిడ్జ్‌: గగనతలంలో భారీ స్థాయిలో కర్భన ఉద్గారాలను వెదజల్లే చిన్న విమానాలకు చరమగీతం పాడేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నడుం బిగించింది. వాయుకాలుష్యం లేని అధునాతన విద్యుత్‌ విమానాన్ని సిద్ధంచేస్తోంది. ఈ ప్రయోగాత్మక విమానానికి ఎక్స్‌–57 అని నామకరణం చేసింది. ఈ ఏడాదే ఈ బుల్లి విమానం గగనతల అరంగేట్రం చేయనుంది. దీనిని 14 ప్రొపెల్లర్లను అమర్చారు.

ఇటలీ తయారీ టెక్నామ్‌ పీ2006టీ నాలుగు సీట్ల విమానానికి ఆధునికత జోడించి లిథియం అయాన్‌ బ్యాటరీలతో పనిచేసేలా కొత్త ఎలక్ట్రిక్‌ ఏరోప్లేన్‌ను సిద్ధంచేస్తున్నారు. సాధారణంగా ఉండే రెండు రెక్కలకే అటు నుంచి ఇటు చివరిదాకా సమ దూరంలో ఎక్కువ బ్యాటరీలు, చిన్న మోటార్ల కలయితో ప్రొపెల్లర్లను ప్రయోగాత్మక డిజైన్‌లో అమర్చడం విశేషం.  ప్రయాణసమయంలో ప్రొపెల్లర్‌తో పనిలేనపుడు వెంటనే దాని బ్లేడ్లు వెనక్కి ముడుచుకుంటాయి.

దీంతో వేగం తగ్గే ప్రసక్తే లేదు. కొత్త డిజైన్‌ ప్రొపెల్లర్లతో శబ్దకాలుష్యం తక్కువ. ఎక్కువ సాంద్రత ఉండే గాలిలోనూ అత్యంత వేగంగా దూసుకెళ్లేలా 11 బ్లేడ్లతో ప్రొపెలర్లను రీడిజైన్‌ చేశారు. ప్రొపెల్లర్లతో జనించే అత్యంత అధిక శక్తి కారణంగా ఈ విమానాలకు పొడవాటి రన్‌వేలతో పనిలేదు. అత్యల్ప దూరాలకు వెళ్లగానే గాల్లోకి దూసుకెళ్లగలవు. ప్రస్తుతానికి 200 కిలోమీటర్లలోపు, గంటలోపు ప్రయాణాల కేటగిరీలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు