-

జనంలోకి జిన్‌పింగ్‌

28 Sep, 2022 05:47 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే.

ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్‌పింగ్‌ మంగళవారం బీజింగ్‌లో అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్‌ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్‌ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్‌ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్‌ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు