సాధించాం.. హ్యూమన్‌ మిరాకిల్‌: జిన్‌పింగ్‌

25 Feb, 2021 16:11 IST|Sakshi
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(ఫైల్‌ ఫొటో)

బీజింగ్‌: దేశంలో పేదరికాన్ని నిర్మూలించి అద్భుతం చేసి చూపించామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అన్నారు. అతి తక్కువ కాల వ్యవధిలోనే కోట్లాది మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక తార్కాణంగా నిలిచామంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పేదరిక నిర్మూలనకై కృషి చేసిన గ్రామీణాధికారులను జిన్‌పింగ్‌ సత్కరించారు. మెడల్స్‌ ప్రదానం చేసి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయం. హ్యూమన్‌ మిరాకిల్‌(మానవుడు సృష్టించిన అద్భుతం). 

తక్కువ సమయంలోనే ఎన్నో కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం’’అని పేర్కొన్నారు. అయితే దేశంలో జరుగుతున్న పరిణామాలకు, అధ్యక్షుడు చెబుతున్న మాటలకు పొంతనే లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదరిక నిర్మూలనకై చేపడుతున్న కార్యక్రమాల్లో అవినీతి పెచ్చుమీరుతున్నా, రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పాలకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సుస్థిరావృద్ధి లక్ష్యాల్లో భాగంగా రోజూ వారీ కనీస ఆదాయాన్ని 2.30 డాలర్లకు పైగా పెంచడానికై కృషి​ చేస్తున్నట్లు చైనా గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1970ల నాటి నుంచి డ్రాగన్‌ దేశం, కడు పేదరికంలో మగ్గుతున్న 800 మిలియన్‌ మంది ప్రజలకు పైగా విముక్తి కల్పించినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 

చదవండి: భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట

మరిన్ని వార్తలు