కరోనాపై పారదర్శకంగా వ్యవహరించాం: జిన్‌పింగ్‌

8 Sep, 2020 11:03 IST|Sakshi

బీజింగ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ విషయంలో తాము పారదర్శకంగా వ్యవహరించామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అన్నారు. ప్రాణాంతక వైరస్‌ ప్రబలిన తరుణంలో సత్వర చర్యలు చేపట్టి దేశ పౌరులతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమ వంతు సాయం చేశామన్నారు. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునురుద్ధరించుకున్న ప్రధాన దేశాల్లో తొలి దేశంగా చైనా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. డ్రాగన్‌ దేశ శక్తి సామర్థ్యాలకు ఇదొక నిదర్శనమన్నారు. కోవిడ్‌-19పై పోరులో క్రియాశీలక పాత్ర పోషించిన ‘కరోనా యోధుల’ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జిన్‌పింగ్‌ మంగళవారం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

 కాగా గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారిగా కరోనా వైరస్‌ ఆనవాళ్లు బయటపడిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు విస్తరించిన మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో కార్యకలాపాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ గురించి సమాచారం ఇవ్వడంలో చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తిందంటూ అమెరికా సహా పలు దేశాధినేతలు డ్రాగన్‌ తీరుపై విరుచుకుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అయితే కోవిడ్‌-19ను ఏకంగా చైనా వైరస్‌ అని సంబోధిస్తూ మాటల యుద్ధానికి దిగారు. అంతేగాక డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు