రష్యాను సందర్శించనున్న జిన్‌పింగ్‌..నాలేగేళ్ల తర్వాత తొలిసారిగా..

17 Mar, 2023 15:07 IST|Sakshi

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వచ్చే వారం రష్యాను సందర్శిస్తారని బీజింగ్‌ మంత్రిత్వశాఖ తెలిపింది. దాదాపు నాలుగేళ్ల అనంతరం జిన్‌పింగ్‌ తొలిసారిగా రష్యాలో పర్యటించనున్నారు. ఆయన చివరిసారిగా 2019లో రష్యాను సందర్శించారు. ఐతే జిన్‌పింగ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మార్చి20 నుంచి మార్చి 22 వరకు రష్యాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో వ్యూహాత్మక సహకారంపై ఇరు దేశాల అధ్యక్షులు చర్చించనున్నారు.

అలాగే అంతర్జాతీయ వేదికపై రష్యా, చైనాల మధ్య సమగ్ర భాగస్వామ్యం వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చిస్తారని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన ఏడాది తర్వాత జరుగుతున్న చైనా అధ్యక్షుడు తొలి పర్యటన. ఒక వైపు యూఎస్‌ దాని మిత్ర దేశాలు రష్యాకు రహస్యంగా ఆయుధాలు మద్దతు అందిస్తోందంటూ చైనాపై ఆరోపణలు గుప్పించాయి. అదీగాక చైనా, రష్యా వ్యూహాత్మక మిత్రదేశాలు తమ మధ్య అంతరాలు లేని భాగస్వామ్యం ఉందని పదే పదే చెబుతుండటమే ఈ ఆరోపణలకు ఆజ్యం పోశాయి. కానీ చైనా మాత్రం వాటన్నింటిని ఖండిస్తూ తాము తటస్థవైఖరిని అవలంభిస్తున్నాం అని నొక్కి చెబుతోంది.

అంతేగాదు గత నెలలో చైనా యుద్ధంపై 12 పాయింట్ల పొజిషన్‌ పేపర్లో అన్ని దేశాల సార్వభౌమాధికారంలో కోసం చర్చలతో సమస్యను పరిష్కారించుకోవాలంటూ రష్యా ఉక్రెయిన్‌ దేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, చైనా విదేశాంగ మంత్రి ఉక్రెయిన్‌, రష్యాలను వీలైనంత త్వరగా శాంతి చర్చలు పునః ప్రారంభించాలని కోరారు. అలాగే అన్ని దేశాలు సంయమనం పాటిస్తాయని, వీలైనంత త్వరితగతిన శాంతి చర్చలు ప్రారంభించి రాజకీయ పరిష్కార మార్గంలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాం అని చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గ్యాంగ్‌ ఫోన్‌ కాల్‌లో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో అన్నారు. 

(చదవండి: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా చౌధరి)

మరిన్ని వార్తలు