నార్త్‌ కొరియా కిమ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. తగ్గేదేలే అంటున్న కొత్త అధ్యక్షుడు

10 Mar, 2022 18:47 IST|Sakshi

సియోల్‌: దక్షిణ కొరియాలో అధ్యక్షుడి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో సౌత్‌ కొరియాకు పీపుల్‌ పవర్‌ పార్టీ అభ‍్యర్థి యూన్‌ సుక్‌ యోల్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పోరులో అధికార డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్​ ఓటమిని అంగీకరించారు. 

ఈ సందర్భంగా యూన్‌ సుక్‌ మాట్లాడుతూ.. మే నెలలో తాను పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం తన విదేశాంగ విధానం గురించి వెల్లడిస్తూ అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ‍్యలు చేశారు.  ఉత్తర కొరియా కవ్వింపులను సమర్థంగా ఎదుర్కొంటామని కిమ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజల భద్రత, దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు.. ప్రస్తుత అధ్యక్షుడు మూన్​ జే-ఇన్​పై ఆయన షాకింగ్‌ ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియావైపు మూన్​ జే ఇన్​ మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన సుక్​ యోల్..​ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు వైట్‌ హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సుక్​యోల్​కు బైడెన్‌ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిపింది. 

మరిన్ని వార్తలు