కాబోయే భార్య ఎగ్జామ్‌ ఫెయిల్‌ అయ్యిందని ఏకంగా స్కూల్‌ని తగలెట్టేశాడు

28 Aug, 2022 11:57 IST|Sakshi

కోపంతో ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు చాలా అనర్థాన్ని సృష్టిస్తాయి. ఆ కోపం వారినే కాదు తనతో ఉన్నవారిని కూడా కష్టాలపాల్జేస్తుంది. అచ్చం అలానే ఇక్కడోక  వ్యక్తి తన కాబోయే భార్య ఎగ్జామ్‌ పెయిలైందన్న కోపంతో చేసిన పని కొంతమంది విద్యార్థుల భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. 

వివారాల్లోకెళ్తే...ఈజిప్టులోని 21 ఏళ్ల యువకుడు తన కాబోయే భార్య చదువుతున్న స్కూల్‌కి నిప్పుపెట్టాడు. తన కాబోయే భార్య ఎగ్జామ్‌లో ఫెయిలైందన్న కోపంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఈజిప్టులోని ఘర్బియా గవర్నరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈజిప్టు రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న మెనోఫియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. సదరు నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసుల ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తన కాబోయే భార్య ఎగ్జామ్‌ ఫెయిలవ్వడంతో ఆమె మరో ఏడాది చదువుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందువల్ల తమ పెళ్లి వాయిదా పడుతుందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పుకొచ్చాడు.

ఐతే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి త్వరితగతిన మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రిన్స్‌పాల్‌ కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్‌ భవనం దారుణంగా దెబ్బతాన్నాయని పోలీసులు చెప్పారు. అంతేగాక ఆ స్కూల్‌లోని కొంతమంది విద్యార్థుల రికార్డులు నాశనమయ్యాయని తెలిపారు. ఐతే అతను ఈ దారుణానికి ఒడిగట్టినప్పుడు చూసిన స్థానికులు అతని గురించి పూర్తి సమాచారం అందించారని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. 

(చదవండి: Lying Down Championship: అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్‌!)

మరిన్ని వార్తలు