కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

11 May, 2021 17:12 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా ముప్పేట దాడితో అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లాది మందిపై కరోనా ప్రభావం తీవ్రంగా చూపింది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఓ యువకుడికి ఉపాధి అవకాశం పోయింది. నిరుద్యోగిగా మారిపోయాడు. అయితే కరోనా వలన నష్టపోయిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రోత్సహాకాలు, రుణాలు తదితర సౌకర్యాలు కల్పించి వారు తిరిగి స్థిరపడేలా అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు విలాసవంత జీవితానికి అలవాటు పడ్డాడు. కరోనా లోన్లు తీసుకుని ఏకంగా ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. 

కాలిఫోర్నియాకు చెందిన యువకుడు ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని పొంది ముస్తఫా విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. ఏకంగా 50 లక్షల కోవిడ్‌ సహాయ నిధిని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాడు. తనకు ఒక కంపెనీ ఉందని.. కరోనా వలన నష్టపోయినట్లు సహాయం కోసం దరఖాస్తు పంపాడు. ఆ దరఖాస్తులకు సమర్పించివన్నీ నకిలీవే. 

అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పే చెక్‌ ప్రొటెక‌్షన్‌’ కార్యక్రమంతో ముస్తఫా లబ్ధి పొందాడు. బ్యాంక్‌లకు వెళ్లి లక్షల రూపాయల రుణం పొందాడు. నకిలీ చెక్కులు, ఐటీ రిటర్న్‌లు సమర్పించి మూడు బ్యాంకులను మోసగించాడు. దీనిపై ఫిర్యాదు రాగా పోలీసులు విచారణ చేపట్టారు. తీరా అతడి వద్దకు వెళ్లగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ముస్తఫా వద్ద ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లు కనిపించాయి. విచారణ చేపట్టగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో ఆ కార్లు కొనుగోలు చేశాడని తెలిసి అవాక్కయ్యారు. ముస్తఫాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద ఉన్న కార్లు, బ్యాంక్‌ ఖాతాలో ఉన్న 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: 
తుపాకీకి భయపడి బిల్డింగ్‌ దూకిన చిన్నారులు

తెలంగాణతో పాటు లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాలు ఇవే!

మరిన్ని వార్తలు