ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?..

31 Jan, 2021 14:56 IST|Sakshi
వీడియో దృశ్యం

బొగోటా : కొందరు కిక్‌ కోసం సాహసాలు చేస్తారు.. మరికొందరు బతకటం కోసం.. ఒకరిది ఆనందం.. మరొకరిది అవసరం. జీవితాన్ని సెటిల్‌ చేసే పని కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేసినా బాగుంటుంది.. కానీ, చిన్న చిన్న పనులకు కూడా ప్రాణాలకు తెగించాల్సి వస్తే! దారుణంగా ఉంటుంది. ప్రసుత్తం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కొలంబియాలోని ఓ గిరిజన తెగకు చెందిన వారు. ఊరు దాటాల్సి వచ్చిన ప్రతిసారి చుక్కలు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొలంబియా, ప్యూబ్లో రికాలోని అగుట నది ఒడ్డున ఎంబెరా చామి అనే ఓ గిరిజన తెగ నివాసం ఉంటోంది. దాదాపు 2000 మంది ఉంటున్న ఆ తెగ వేరే ఊరికి వెళ్లాలంటే అగుట నదిని దాటాల్సి ఉంటుంది. నదిపై వంతెన ఉండటంతో వారి ప్రయాణాలు సాఫీగా సాగేవి. ( బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి )

అయితే గత నవంబర్‌లో వచ్చిన వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. దీంతో నది దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది. చిన్న పిల్లలు మొదలుకుని ముసలివారి వరకు నదికి అటువైపు నుంచి ఇటువైపునకు కట్టిన తాడును పట్టుకుని ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఒడ్డు చేరుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువతి నది దాటడానికి పడ్డ కష్టానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వరద ఉధృతిలో తాడును పట్టుకుని ఆమె నదిని దాటుతున్న దృశ్యాలు ఊపిరాగిపోయే ఉత్కంఠ రేపుతున్నాయి. కానీ, సదరు యువతి నది దాటిందా లేదా అన్నది తెలియకుండానే వీడియో ముగిసింది. తర్వాత ఏమై ఉంటుందా అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.

మరిన్ని వార్తలు